ఫ్లాష్ బ్యాక్: జూన్ 28వ తేదీ…
‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్ ను సమావేశ పరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశపరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
గుర్తుందిగా…? తెలంగాణా రాజధాని కేంద్రమైన హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే అంశంపై గత నెల 28వ తేదీన వెలువడిన అధికారిక ప్రకటనలోని ఓ పేరా మాత్రమే ఇది. జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ‘లీక్’ వార్తల నేపథ్యంలో హైదరాబాద్ నగరం సగం వరకు ఖాళీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే దశలో రాజధానిలో మళ్లీ లాక్ డౌన్ అంశంపై మంత్రులు కీలక ప్రకటన చేస్తుండడం విశేషం. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఈ అంశంపై నిన్న కరీంనగర్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ లాక్ డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని చెప్పారు. జీవితం, జీవనోపాధి ముఖ్యమని, కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజాగా గురువారం మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ తో ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కరోనా వస్తుంది, పోతుంది, కాబట్టి ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ను ఆపగలరని మంత్రి వ్యాఖ్యానించారు. హోం మంత్రి మహమూద్ ఆలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావులను మంత్రి తలసాని ఈ సందర్భంగా ఉదహరించారు. ఇద్దరు మంత్రుల కీలక వ్యాఖ్యల నేపథ్యంలో… మొత్తానికి జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధింపు ఉండకపోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.