కరోనా మహమ్మారి వలస కూలీల బతుకును దుర్భరం చేసింది. పొట్ట చేతబట్టుకుని, వందలాది కిలోమీటర్లు దాటి తెలంగాణాలో అడుగిడిన వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు లాక్ డౌన్ నేపథ్యంలో స్వరాష్ట్రాల బాట పట్టారు. వ్యవసాయ పనులు కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, కరోనా పరిణామాలు సేద్యపు రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
మిర్చి ఏరివేత వంటి వ్యవసాయ కూలీ పనుల కోసం వచ్చిన మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు మంత్రి సత్యవతి రాథోద్ కంటపడ్డారు. చలించిన మంత్రి నడి రోడ్డుపైనే కూలీల పక్కన కూర్చుని వారి వివరాలు ఆరా తీశారు. మహబూబాబాద్ మండలం ఆమనగల్లు సమీపాన వలస కూలీలను కలుసుకున్న మంత్రి వారిని నిలువరించారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో రాష్ట్రం దాటి వెళ్లకూదని వారికి నచ్చజెప్పి, బియ్యం, వంట సామాగ్రిని అందించారు. పది వేల రూపాయల నగదును కూడా మంత్రి వ్యక్తిగతంగా వారికి అందించారు. లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడేవరకు వారికి ఆమనగల్లు పాఠశాలలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ పనుల్లో ఉపాధి కల్పించాలని సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా తన నియోజకవర్గంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పయనిస్తున్న సందర్భంగా కాలినడకన వెడుతున్న వలస కూలీలు ఆమెకు తారసపడ్డారు. కరోనా కారణంగా పనుల్లేక 150 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామాలకు కాలిబాట పట్టిన ఒడిషా కూలీలను చూసి సీతక్క చలించారు. వారికి దారి పొడవునా ప్రయాణంలో సరిపడే కూరగాయలను పంపిణీ చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనకు ఫోన్ చేయాలని, మార్గంలో భోజనాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇటువంటి వలస కూలీలు ఎదురుపడితే కష్టకాలంలో వారిని ఆదుకోవాలసిందిగా సీతక్క ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఒడిషా కూలీలను ఎమ్మెల్యే సీతక్క ఆదుకుంటున్న వీడియోను దిగువన చూడవచ్చు.