ఏప్రిల్ 14న లాక్ డౌన్ తొలగిస్తారని ఎదురు చూసిన వారికి పొడిగింపు నిర్ణయం రుచించి ఉండదు. కానీ పొడిగింపు ఎందుకు అనేది తెలుసుకుని భవిష్యత్తు గురించి ఊహించుకుంటే వామ్మో అనుకుని, కరోనా మహమ్మారి పూర్తిగా తొలగి పోయే వరకు ఈ లాక్ డౌన్ ను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటారు.

ఇది ఎలాగంటే, భారతదేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించి తొలి కేసు వెలుగు చూసింది జనవరి 30వ తేదీన. ఇంత పగడ్బందీగా లాక్ డౌన్ ను అమలు చేస్తూ, వైద్య సేవలను అందిస్తున్నా కూడా జనవరి 30వ తేదీ నుండి ఏప్రిల్ 14వరకు ఈ 76 రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,815 చేరింది. దేశ వ్యాప్తంగా 353 మరణాలు కూడా సంభవించాయి. ఒక్క కేసు పది వేల కేసులను దాటిందంటే, లాక్ డౌన్ ను తొలగించి మనం స్వేచ్చా విహారం చేస్తే ఈ పది వేల కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని లక్షలు, కోట్లకు చేరతాయో, ఎన్ని మరణాలు సంభవిస్తాయో ఒకసారి ఊహించుకోండి.

లాక్ డౌన్ పొడగించినా లేదా తొలగించినా మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా మహమ్మారిని మన దరికి చేరకుండా చూడవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లండన్ నుంచి వచ్చిన తన కుమారుని ద్వారా పోలీసు అధికారి అయిన తండ్రికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. తనలో ఈ వైరస్ లక్షణాలు తెలియక ఆ పోలీసు అధికారి తన విధులను యధావిధిగా నిర్వహించారు.

ఈ ఘటనను పరిశీలనగా చూస్తే కొడుకు నుంచి తండ్రికి వచ్చింది కానీ, తండ్రి తన విధులను నిర్వర్తించినా తోటి ఉద్యోగులకు ఎవరికీ ఈ వైరస్ సోకలేదు. కారణం సాధారణంగానే ఒక పోలీసు అధికారిని కింది స్థాయి ఉద్యోగులు అంతగా రాసుకు, పూసుకు తిరగరు. అదే విధంగా తాను సైతం పై అధికారులతో అంత సన్నిహితంగా మెలిగే అవకాశం ఉండదు. దీనిని బట్టి భౌతిక దూరం ఎంత పాటిస్తే అంత ప్రయోజనం ఉంటుందనే విషయం రూఢీ అయినట్లుగానే భావించవచ్చు.

మొత్తంగా కరోనా వైరస్ కు మందు కనుగొనడం లేదా ఆ వైరస్ తనంతట తాను అంతరించి పోవడం. ప్రతి జీవికి ఉండే జీవిత కాలం లాగా కొంతకాలంలో అంతర్థానం అయిపోవడం. ప్రస్తుతం కొత్తగా పోలియో కేసులు ఎక్కడా కనిపించవు. అదే విధంగా కరోనా వైరస్ కూడా అంతరించి పోయినప్పుడే మనం ఊపిరి పీల్చుకుంటాం.

ఇవి మన ఆశలు. మనిషి ఆశాజీవి. ఈ ఆశలు నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ అప్పటి వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా!?

✍ తుమ్మలపల్లి ప్రసాద్

Comments are closed.

Exit mobile version