గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ‘మళ్లీ లాక్ డౌన్’ దిశగా సర్కారు అడుగులు వేస్తోందనే వార్తలపై తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ తనదైన రీతిలో స్పందించింది. లాక్ డౌన్ లక్ష్యమేమిటో, అందుకు ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరేమిటో సూచనలు చేస్తూనే, కరోనాపై సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు చేసింది. కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నా, టెస్టులు చేయకుండా, వైద్య సదుపాయాలు మెరుగు పరచకుండా, ‘మళ్ళీ లాక్ డౌన్’ను ఒక తమాషాలా మారిస్తే ప్రజలు తిండి కూడా దొరకకుండా ఛస్తారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఓ వ్యాసాన్ని ప్రచురించింది. అదే ఈ కథనం. ఇక చదవండి.
GHMC పరిధిలో మళ్ళీ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలొస్తున్నాయి… గతంలో లాక్ డౌన్ విధించినప్పుడు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు, పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు సామాన్యమైనవి కావు. ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రజలు ప్రభుత్వానికి సహకరించారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజల త్యాగాన్ని మంటలో కలిపింది.
లాక్ డౌన్ అంటే… తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన సామాన్య ప్రజలను బాదడానికి, తిని పడుకోడానికి, విలాసాలకు, వినోదాలకు, ఉత్సవాలకు సమయం వృధా చేయడానికి కాదు. లాక్ డౌన్ వ్యాధి వ్యాప్తిని తాత్కాలికంగా కట్టడి చేసి, వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలకోసం ప్రభుత్వాలకు సమయం లభించేలా చేస్తుంది. ఈ సమయాన్ని ప్రభుత్వం పరీక్షల సామర్ధ్యాన్ని, వైద్య సదుపాయాలు పెంచడానికి, ప్రజలలో వ్యాధిపై అవగాన పెంచడానికి సమర్ధంగా వినియోగించాలి. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత పెరిగే వ్యాధి తీవ్రతను కట్టడి చేయడం, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం లాక్ డౌన్ యొక్క ప్రధాన లక్ష్యం.
కానీ మన ప్రభుత్వం ఏం చేసింది? లాక్ డౌన్ ను కేవలం తమాషాలాగా పోలీసులతో రోడ్డుపైకి వచ్చిన సామాన్య ప్రజలను కొట్టించి, ప్రజలను కఠినంగా కట్టడి చేయడమే లాక్ డౌన్ ఉద్దేశమని భ్రమింపచేసింది. కరోనా కట్టడికి మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పరీక్షల సామర్ధ్యం ఏమాత్రం పెంచలేదు. వైద్య సదుపాయాలు మెరుగు పరచలేదు… సరికదా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచుకోమని డిమాండు చేస్తే పరీక్షలు చేస్తే ప్రైజు లిస్తారా…? అంటూ అవహేళన చేసింది.
రాష్ట్రంలో వైద్య సదుపాయాలను, వెంటిలేటర్ల సంఖ్యను పెంచే ప్రయత్నాలేమాత్రం చేయలేదు. మొన్ననే చనిపోయిన రవి అనే యువకుడికి ప్రాణాపాయ పరిస్థితుల్లో వూపిరి ఆగి చనిపోతాడని తెలిసినా, వెంటిలేటర్ తీయవద్దని వేడుకుంటున్నా, అతనికి వెంటిలేటర్ తీసి అతని ప్రాణాలు తీశారని మృతుని తండ్రి ఆరోపిస్తున్నారు. ‘డాడీ రా, డాడీ రా…. అని ఆ బిడ్డడు ఏడుస్తుంటే ఆ తండ్రి మనస్సు ఎంత క్షోభించిందో కదా… అసలు ఆ యువకుడికి వెంటిలేటర్ తీసి వేయాల్సిన పరిస్తితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇంత వరకూ లేదు.
నిజానికి వెంటిలేటర్లు కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు. ఒక్క రోజు కొండ పోచమ్మ తమాషాకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక్కసారి కొండ పోచమ్మ నింపడానికి అయ్యే ఖర్చుతో ( సుమారు రెండు వేల కోట్లు) దేశానికి అవసరమైన మొత్తం వెంటిలేటర్లు కొనుగోలు చేయవచ్చు. అతి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు ఎలా తయారు చేయవచ్చో చూపెడుతూ కొందరు ప్రత్యక్షంగా చూపించారు. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఎప్పుడో ఏప్రిల్ 20 నాటికే TIMS హాస్పిటల్ సిద్దమైందని ప్రకటించారు, కానీ ఇప్పటికీ అది తెరుచుకోలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఏమనాలి? మరణించిన వ్యక్తులకు కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు సూచిస్తే, ICMR మార్గదర్శకాల పేరుతో సుప్రీం కోర్టుకు వెళ్ళి స్టే తీసుకు రావడం కన్నా హేయమైన చర్య ఉంటుందా? మరణించిన వ్యక్తులనుండి కుటుంబ సభ్యులకు పాకి ఎంత మంది కరోనా బారిన పడ్డారో లెక్క లేదు.
సరే.. ICMR నిబంధనలన్నా సరిగ్గా పాటిస్తుందా అంటే అదీ లేదు. పాజిటివ్ పేషెంట్ల ప్రైమరీ కాంటాక్టులకు తప్పని సరిగా పరీక్షలు చేయాలని ICMR చెబుతుంటే వాటిని గాలికి వదిలేశారు. యువకుడు రవి కరోనాతో మరణించిన తరువాత కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇప్పటివరకూ పరీక్షలు చేయలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట.
ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. డాక్టర్లకూ, పోలీసులకూ, జర్నలిస్టులకూ, మున్సిపల్ సిబ్బందికీ, ఉద్యోగులకూ, ప్రజా ప్రతినిధులకూ ఈ వైరస్ సోకింది. అనేక మంది మరణిస్తున్నారు. లెక్కలు చూపని మరణాలెన్నో…! అయినా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు… కనీసం రోగం వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ లో చేర్చుకునే పరిస్తితి లేదు. ప్రైవేటు హాస్పిటల్స్ కు పోదామా అంటే, కరోనా కన్నా వారి దోపిడీ తట్టుకునే పరిస్థితి ఎవరికీ లేదు. ఆస్తులు అమ్ముకుని చేరదామంటే అక్కడా బెడ్లు దొరకడం లేదు.
ఫీజులపై ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ప్రైవేటు హాస్పిటల్స్ తుంగలో తొక్కుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఐదు రోజులకు సామాన్య వైద్యానికి మూడున్నర లక్షలు వసూలు చేసిన ప్రూఫ్ బయటకు వచ్చినా ప్రభుత్వం కిమ్మనడం లేదు. కానీ టెస్టులపై ప్రైవేటు ల్యాబ్స్ సరిగ్గా నిర్వహించడం లేదంటూ వాటిపై పడ్డారు. టెస్టు చేయకుంటే ప్రాణాలమీదకు వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్చుకోరు. ఇటు ప్రభుత్వం పరీక్షలు చేయదు. ప్రైవేటు ల్యాబ్స్ పై నియంత్రణ చాత కాదు.. ఏం చేసైనా సరే పరీక్షల సంఖ్య తగ్గించి, రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని దేశానికి చెప్పాలనే ఒకే ప్రయత్నం. ఇది ఎక్కువ రోజులు సాధ్యం కాదని తెలిసొచ్చింది. ఇప్పుడు రోజుకు వేల సంఖ్యలో కేసులు… చేసే 4,000 పరీక్షలకు సగటున వెయ్యి పాజిటివ్ లు… ఇక ప్రజల దృష్టి మరల్చడానికి హరిత హారాలనీ, మరొకటనీ ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రాణాల మీదికి వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చడం సాధ్యం కాదని నాయకులు గుర్తించాలి.
ఇప్పుడు లాక్ డౌన్ అంటూ మళ్ళీ లీకులు. మీకన్నా ముందే ప్రజలు కళ్ళు తెరిచి ఎవరి లాక్ డౌన్ వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మీరు మళ్ళీ లాక్ డౌన్ అంటూ మళ్ళీ గతంలోలా చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే వేల మందికి కరోనా సోకింది. లాక్ డౌన్ విధిస్తే వారందరికీ వైద్యసదుపాయం ఎలా అని ఆలోచించండి. కనీసం వారందరికీ ఒక వైపు లాక్ డౌన్ విధించి, మరో వైపు టెస్టులు చేయకుండా, వైద్య సదుపాయాలు మెరుగు పరచకుండా, మళ్ళీ లాక్ డౌన్ ను ఒక తమాషాలా మారుస్తే ప్రజలు తిండి కూడా దొరకకుండా ఛస్తారు.
ఇప్పటికైనా చిత్తశుద్దితో పని చేయండి. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు…
✍️ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ,
తెలంగాణ రాష్ట్ర కమిటీ