ఎవరింట్లో వాళ్లే దొంగతనాలకు పాల్పడితే… ఎవరి షాపులో సొత్తు వాళ్లే చోరీ చేస్తే… ఇటువంటి వారినే ఇంటిదొంగలు అంటుంటారు. ఈశ్వరుడు కూడా వీళ్లను పట్టలేడన్నది నానుడి. అక్రమ లిక్కర్ దందాలో తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం ఇదే తరహా మీమాంసను ఎదుర్కుంటోంది. లిక్కర్ డిస్టిలరీలు బంద్ ఉన్నాయి. వైన్ షాపులకు మద్యం సరఫరా చేసే సర్కారు వారి ఐఎంఎల్ డిపోలకు తాళం వేశారు. కానీ తెలంగాణాలోని పలు జిల్లాల్లో యధేచ్ఛగా లిక్కర్ బ్లాక్ దందా కొనసాగుతోంది. ఇదెలా సాధ్యం…? అసలు సరుకు ఎక్కడి నుంచి వస్తోంది? ఇదీ సర్కారు సార్లు… ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు ఎదుర్కుంటున్న ప్రశ్న.
ఔను… కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్న తెలంగాణాలోని పలు జిల్లాలో లిక్కర్ వ్యాపారం దొడ్డి దారిన, ఇష్టారాజ్యంగా, భారీ ఎత్తున కొనసాగుతోంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కరలేదు. ‘అమృత్’ అమల్గమ్ అనే ప్రపంచ ఖ్యాతి గాంచిన లిక్కర్ బ్రాండ్ తో మద్యం వ్యాపారులు రాజకీయ అండను సంపాదించుకుంటున్నారు. అందువల్లే కొందరు వైన్ షాపు నిర్వాహకులు చోరావతారం ఎత్తుతున్నట్లు కనిపిస్తోంది. మద్యం విక్రయాలకు సర్కారు నుంచి బాజాప్తా లైసెన్స్ పొందిన లిక్కర్ వ్యాపారులు కొందరు దొంగలుగా మారారన్నది కాదనలేని వాస్తవం. ఇది ఎవరో చేస్తున్న ఆరోపణ కాదు. సాక్షాత్తూ ఎక్సజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారే స్వయంగా ఈ చోర విషయాన్ని ప్రకటించారు.
లాక్ డౌన్ పరిణామాల్లో తెలంగాణాలోని వైన్ షాపులకు, బార్లకు ఎక్సైజ్ అధికారులు సీళ్లు వేసి నలభై రోజులు కావస్తోంది. వేసిన సీళ్లు వేసినట్లే ఉన్నాయి. కానీ లిక్కర్ దందా అక్రమా మార్గాన కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు రూ. 500 ఖరీదు చేసే లిక్కర్ బాటిల్ రూ. 5 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ‘కారు’ల్లోనే ఎక్కువగా పట్టుబడుతున్న లిక్కర్ దందా వెనుక ఎవరున్నారనేది అసలు ప్రశ్నే కాదు. ఎందుకంటే తాళాలు బిగించాక, సీళ్లు వేశాక లిక్కర్ బయటకు రావడమే ఆసక్తికరమైన అసలు ప్రశ్న.
ఎన్డీపీ సరుకు (నాన్ డ్యూటీ పెయిడ్) రాష్ట్రంలో ప్రవేశించడానికి ఛాన్సే లేదంటున్నారు. దేశ్యవాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీ సరుకు వచ్చే అవకాశమే లేదని ఎక్సైజ్ వర్గాలే చెబుతున్నాయి. మరెలా వస్తోందనేగా అసలు ప్రశ్న. ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఓ విషయాన్ని వెల్లడించారు. మద్యం వ్యాపారులు కొందరు తమ లిక్కర్ స్టాకును తామే తస్కరించి చోరీ జరిగిందని బొంకేందుకు ప్రయత్నిస్తున్నారట. భద్రాచలంలో ఇదే విధంగా చేసిన వారిని పట్టుకున్నట్లు ఆయన ప్రకటించారు. లాక్ డౌన్ అనంతరం మద్యం షాపులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలిస్తారట. స్టాక్ వివరాల్లో తేడాలుంటే రకరకాల కఠిన చర్యలు తీసుకుంటారట.
ఎక్సైజ్ శాఖ డీసీ వెల్లడించిన అంశం ప్రకారం తేలిందేమిటంటే… లాక్ డౌన్ పరిస్థితుల్లో కొందరు లిక్కర్ వ్యాపారులే దొంగలుగా మారుతున్నారన్నమాట. తాజాాగా ఖమ్మం నగరంలోని ఓ రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ‘కారు’లో పట్టుబడిన 43 ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా 13వ నెంబర్ వైన్ షాపు నుంచే బయటకు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. అక్కడి నుంచి రెస్టారెంట్ ఎండీ కారులోకి ఎలా వచ్చాయంటే…? అదంతా ‘అమృత్’ బంధం ‘కత’. లిక్కర్ దొంగలతో కొందరు రాజకీయ ప్రముఖులు పెనవేసుకున్న అనుబంధానికి ఈ ఘటన తార్కాణమన్నమాట. అందుకే ఒక్కో ప్రముఖుడికి నాలుగేసి బాటిళ్లను ‘గిఫ్ట్’గా సరఫరా చేసే క్రమంలో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి ఆయా ఖరీదైన సరుకును పట్టుకున్నట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది.
మొత్తంగా కొందరు లిక్కర్ ‘లైసెన్స్’ దొంగల చోరకళ కారణంగా నష్టపోయేదెవరంటే… ఆదాయపరంగా సర్కారు ఖజానాకే అతిపెద్ద బొక్క. లిక్కర్ దొరకని సామాన్య వ్యసనపరుడు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిపాలు. ఈ దందాలో బాగుపడేవారి విషయానికి వస్తే రూ. 500 సరుకును రూ. ఐదు వేలకు అమ్ముకునే కొందరు లిక్కర్ ‘లైసెన్స్’ దొంగలు. వారిని కాపాడేందుకు వృత్తిపరంగా లభించిన పరపతిని శతవిధాలుగా ఉపయోగించే ప్రశ్నార్థకపు జీవులు.