గుహ లోంచి ఏమిటీ ధార, వాగై వంకలు తిరుగుతూ బిందు చిందులు వేస్తూ పరిగెడుతూ
ఎందుకిలా పరవళ్లు తొక్కుతోంది?
ఆగిపోతున్న శ్వాసలను హారం చేసుకొని, కట్టెలను కిరసనాయిలు డబ్బాలను నెత్తిన పెట్టుకొని ప్రేత యాత్రకు బయల్దేరిన దేశం వెంటబడుతున్నది ఎందుకు?
ఊపిరి కొనకు వేలాడుతున్న రేపటి శవాల మీది నగ నట్రా వొలుచుకొంటున్న త్రాసుపత్రులను
ప్రజలపరం చేయాల్సిన బాధ్యత మరచి
విదేశీ లాకర్లలోని ఎగవేత ధనాన్ని రప్పించి
తన చంకనెక్కి కూచున్న
కన్నపుగాళ్ళను బొక్కలో దోసి
వర్తమానం హృదయం మీద
జన సంతకం చేయించడం విడిచి
వ్యాక్సిన్ల వ్యాపారుల కొమ్ములను విరిచి
ఔషధం చెరను పునాదులతో పెకలించి
కార్పొరేట్ కారాగారాల నుంచి
విద్యను విడిపించి
ప్రజా ఫిరంగులతో వైరస్ ను తరిమి
జన కల్యాణానికి పందిళ్ళు
వేయాల్సిన వేళ
గుహ లోంచి ఏమిటీ కన్నీటి ధార?
విదిలించాల్సిన జూలు విలపిస్తోందేల?
గర్జించాల్సిన గొంతులో గద్గదమెందుకు?
జాతిని మరెన్ని గ్రహణాలకు
గురి చేసే ఘాతుక లీల?
– శ్రీరామ మూర్తి
సీనియర్ ఎడిటర్