కట్టుకున్న భార్యను కడతేర్చిన ఓ భర్తకు జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి అనుపమ చక్రవర్తి గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గుర్రాల లక్ష్మణ్ (35)కు, కరీంనగర్ లోని హుస్సేనీపురా ప్రాంతానికి చెందిన శశికళ (28)తో 2015వ సంవత్సరం జనవరి 30వ తేదీన వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ కరీంనగర్ లోని విద్యానగర్ లో అద్దెకు నివాసముంటున్నారు. అయితే భార్యను అనేక రకాలుగా అనుమానిస్తూ లక్ష్మణ్ ఆమెను తరచూ పుట్టింటికి పంపేవాడు. ఈ విషయంలో పెద్దల సమక్షంలో పంచాయతీ ద్వారా మాట్లాడుకుని భార్యను లక్ష్మణ్ మళ్లీ కాపురానికి తెచ్చుకునేవాడు. ఇలా అనేకసార్లు జరిగింది.
అయితే 2017వ సంవత్సరం ఏప్రిల్ 15న లక్ష్మణ్ తన భార్య శశికళను తాడుతో ఉరివేసి చంపాడు. తనపై ఎటువంటి అనుమానం రాకుండా ఆమెకు సంబంధించిన బంగారు, వెండి నగలను ఎత్తుకువెళ్లాడు. మరుసటి రోజు ఉదయం తనకేమీ తెలియనట్లు అద్దె ఇంటి యజమానికి ఫోన్ చేసి తన భార్యతో మాట్లాడించాలని కోరాడు. దీంతో ఇంటి యజమాని గదిలోకి వెళ్లి చూసేసరికి శశికళ ఉరి దృశ్యం కనిపించింది. విషయాన్ని ఆమె భర్తతోపాటు హుస్సేనీపురాలో ఉంటున్న శశికళ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అనుమానాస్పదంగా గోచరించిన ఈ ఘటనపై ఫిర్యాదును స్వీకరించిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తన భార్యను లక్ష్మణే హత్య చేసినట్లు పకడ్బందీ సాక్ష్యాధారాలతో పోలీసులు నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను, సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి అనుపమ చక్రవర్తి శశికళ భర్త లక్ష్మణ్ ను నేరస్థునిగా నిర్ధారిస్తూ, అతనికి జీవిత ఖైదుతోపాటు 12 వేల జరిమానాను కూడా విధించారు.
ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి, కీలక సాక్ష్యాలను సేకరించి నిందితునికి శిక్ష పడడంలో ప్రతిభ చూపిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులను పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు.
ఫొటో: భార్యా హంతకుడు లక్ష్మణ్