అసలే దండకారణ్యం…అధికార పార్టీ ముఖ్య నాయకుడు ఒకరికి ఆమె వార్నింగ్…పద్ధతి మార్చుకోవాలని సూచన…లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిక. ఈ ఘటనతో తెలంగాణా రాష్ట్ర పోలీసులకు ఒకటే టెన్షన్. సమసిపోయిందనుకున్న సమస్య ఎక్కడో జీవం పోసుకుంటున్నట్లు అనుమానమే కాదు… ఆనవాళ్లు కూడా…నిరంతర గాలింపు…కానీ అక్కడి అడవుల్లో చాపకింద నీరులా ఇంకేదో ప్రమాదం ముంచుకొస్తోందని హెచ్చరికలు అందుకున్నవారిలో అనేక మందికి ఒకింత ఆందోళన.

అబ్బే అదేమీ లేదు…రాష్ట్రంలో మళ్లీ ఆ సమస్యే ఉత్పన్నం కాదు. ఎప్పడో ఏరిపారేశామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన ఉదంతాలు. రాష్ట్ర రాజధాని వరకు వాళ్లు చొరబడ్డారని ఈనెల 9న అదే పోలీసుల ప్రకటన. ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో మావోలు కూడా ఉన్నారని వెల్లడి. ఇందుకు బలం చేకూరే విధంగా ఓ దంపతుల అరెస్ట్ ఘటన. ఇంతకీ తెలంగాణాలో మావోయిస్టు కార్యకలాపాలు ఉన్నట్లా? లేనట్లా? ఈ అంశంలో పోలీసులు చెప్పే వివరణ ఎలా ఉన్నప్పటికీ, ఏటూరునాగారం దండకారణ్యం మాత్రం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ములుగు జిల్లా పరిషత్ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ ను టార్గెట్ చేస్తూ ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోయిస్టు పార్టీ తరపున ఓ ప్రకటన వెలువడింది. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఏటూరునాగారం జనక్షేత్రంలో తేల్చుకుందామని, సబిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్ ప్రతి సవాల్ విసిరారన్నది వేరే విషయం.

కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసు యంత్రాంగానికి, ముఖ్యంగా ములుగు జిల్లా పోలీసులకు సబిత లేఖ ఇప్పడు ఓ పెద్ద సమస్యే కాదు…ఆమె ముఖ్య టార్గెట్ కూడా. ఒకప్పుడు… అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు నక్సలైట్లు గెరిల్లా జోన్ గా ప్రకటించిన ఏటూరునాగారం ఏరియాలో నక్సలైట్ దళం తిరిగే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయా? అన్నది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే ఏటూరునాగారం దండకారణ్యానికి ఉన్నచరిత్ర అటువంటిది మరి. ఒకటి కాదు…రెండు కాదు. అనేక నక్సల్ గ్రూపుల కార్యకలాపాలకు అక్కడి అడవులు అప్పట్లో పెట్టని కోటలు. జనార్ధన్ నుంచి జంపన్న వరకు, సామా అంతిరెడ్డి అలియాస్ సత్తెన్న నుంచి ప్రసాదన్న, చలమన్న వరకు… అనేక నక్సల్ గ్రూపుల నేతల నాయకత్వానికి తిరుగులేని రక్షణ కల్పించిన అటవీ ప్రాంతం. ప్రభుత్వ, పాలకుల విధానాలతోపాటు ఇతరత్రా అనేక అంశాల కారణంగా ప్రస్తుతం అక్కడ తీవ్రవాద గ్రూపుల అలికిడి అంతంత మాత్రమే. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఒడ్డుకు అవతలి వైపున గల ఛత్తీస్ ఘడ్ లో షెల్టర్ తీసుకుంటున్న మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు అప్పడప్పుడు చిన్నా, చితకా ఘటనలకు పాల్పడుతున్నారని వివిధ సందర్భాల్లో పోలీసులు ప్రకటిస్తున్నారు. భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు అడపా, దడపా జరుగుతున్న సంఘటలనపై పోలీసుల వాదన ఇదే.

అయితే ఏటూరునాగారం ప్రాంతం పరిపాలనాపరంగా పోలీసు శాఖ ఇప్పడు అత్యంత శక్తివంతమనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ములుగు నుంచి ఏటూరునాగారం వరకు గల రెండు సర్కిళ్లను ఒకే పోలీసు అధికారి నియంత్రించిన చరిత్ర ఉంది. కానీ ఇప్పడు ములుగు ఓ జిల్లా కేంద్రం. ఏటూరునాగారం సబ్ డివిజనల్ పోలీసు అధికారి పోస్టింగ్ గల కేంద్రం. జిల్లా కేంద్రమైన ములుగు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో గల ఏటూరునాగారం మీదుగా వాజేడు, వెంకటాపురం వరకు ఓ ఎస్పీ, అదనపు ఎస్పీ, ఓఎస్డీ (ఆపరేషన్స్), ములుగు, ఏటూరునాగారం కేంద్రాలుగా ఇద్దరు డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు గల పటిష్ట పోలీసు యంత్రాంగం. కన్నాయిగూడెం వంటి ప్రాంతం ప్రస్తుతం మండల కేంద్రం కూడా. అక్కడా పోలీస్ స్టేషన్ ఉంది.

ఈ పరిస్థితుల్లోనే ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో జెడ్పీ చైర్మన్ స్థాయి ప్రజాప్రతినిధికే కాదు…స్థానిక రాజకీయ నేతలకు, అవినీతికి పాల్పడుతున్నారంటూ కొందరు ప్రభుత్వ అధికారులకు సబిత పేరుతో సీరియస్ వార్నింగ్ లేఖ. 1980వ దశకంలో అప్పటి పీపుల్స్ వార్ ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ పేరుతో కార్యకలాపాలు నిర్వహించిన దళనేత జనార్ధన్ తరహాలోనే సబిత కమిటీ ఆనవాళ్లు. ఇంతకీ సబిత అనే నక్సల్ నేత మావోయిస్టు పార్టీలో ఉన్నారా? ఉంటే ఏటూరునాగారం-మహదేవపూర్ అడవుల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? దళం కదలికలను పోలీసులు కూడా పసిగట్టారా? ఇటువంటి అనేక ప్రశ్నలకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు. పోలీసులు తమ పని తాము చేస్తూనే ఉన్నారు. అడవులను జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాటాపూర్ సమీపంలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్న తమపై తేనెటీగల దాడి ఉదంతాన్ని పోలీసులు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. కానీ అధికార పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేతను హెచ్చరిస్తూ సబిత పేరుతో విడుదలైన లేఖ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అధికార పార్టీ నేతల మధ్య గల అంతర్గత విభేదాలు కూడా ఈ లేఖకు కారణంగా పలువురు భావిస్తుండడం కొసమెరుపు.

Comments are closed.

Exit mobile version