రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అడ్వకేట్స్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యోదంతాన్ని పోలీసు అధికారులు ప్రకటించారు. నిన్న జరిగిన ఈ దారుణ ఘటనలో రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలియలేదని, గుంజపడుగు గ్రామంలోని స్థానిక వివాదాలే ఇందుకు దారి తీశాయని ఐజీ నాగిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులైన కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్ లను అరెస్ట్ చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఐజీ నాగిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం… నిన్న అడ్వకేట్ వామనరావు మంథని కోర్టు వద్దకు వచ్చాడని తెలుసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లేటప్పుడు చంపాలని నిందితులు పథకం వేసుకున్నారు. ఇందుకు కుంట శ్రీనుకి తోడుగా ఇంకొక వ్యక్తి చిరంజీవిని తీసుకున్నాడు. శ్రీను తన కారుని కుమార్ కి బ్యాంకు వద్ద ఇచ్చి వామన్ రావు కదలికలు తెలియజేయాలని చెప్పగా, అక్కపాక కుమార్, కుంట శ్రీనివాస్ కారు తీసుకున్నాడు. బిట్టు శీను తన కారును, రెండు కొబ్బరి బొండం కొట్టే కత్తులను కుంట శ్రీనుకి తీసుకొచ్చి ఇచ్చాడు. బిట్టు శీను నుండి కుంట శీను కారు తీసుకోగా, ఆ కారును చిరంజీవి డ్రైవింగ్ చేస్తూ ఉంటే కుంట శ్రీను పక్కన కూర్చుని మంథని చౌరస్తాకి చేరుకున్నారు. అదే సమయంలో వామన్ రావు తన భార్య పివి నాగమణితో కలిసి కారులో నెంబర్ (నెంబర్ టిఎస్ -10-ఇజె -2828)లో బయలుదేరి పెద్దపెల్లి వైపు వెళ్లే సమాచారాన్ని నిందితులు ముందుగానే తెలుసుకున్నారు. ఈమేరకు వారి కంటే ముందే కుంట శీను, చిరంజీవి రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులో రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ఏరియాకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో కారు కచ్చితంగా నెమ్మదిగా వెళ్తుందని అక్కడే ముందుగానే వారి రాక కోసం కారుని రోడ్డు పక్కన ఆపారు. వామన్ రావు కారు తమ ముందుకు రాగానే దానికి టక్కర్ ఇచ్చి కారును ఆపారు. అనంతరం కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు ముందుకి వెళ్లి అద్దంపై కొట్టగా డ్రైవర్ భయపడి కారు ఆపి దిగి పారిపోయాడు.

వామన్ రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారుని నడపడానికి ప్రయత్నం చేయగా, కుంట శీను వామన్ రావుని కారులో నుంచి బయటకు గుంజి కత్తితో అతనిపై దాడి చేశాడు. అదే సమయంలో చిరంజీవి రెండో పక్క నుండి వచ్చి వామన్ రావు భార్య నాగమణిపై కత్తితో దాడి చేయగా ఆమె గాయాలతో కారు సీట్లోనే పడిపోయింది. ఆ తర్వాత చిరంజీవి కూడా వామనరావు వద్దకు వచ్చి తాను కూడా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వీడియో తీశారు. వామన్ రావును ఉద్దేశించి… నీపై దాడి చేసిన వారు ఎవరు? అని అడగగా, అతని పేరు కుంట శ్రీనివాస్ గుంజపడుగు, ఇంకొక వ్యక్తి అని తెలిపారు. దాడి జరిగిన తర్వాత వెంటనే కుంట శ్రీను, చిరంజీవి తాము తీసుకువచ్చిన వచ్చిన నల్ల రంగు బ్రీజా కార్ లోనే 8 ఇంక్లైన్ కాలనీ నుండి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లారు. బ్యారేజీ వద్ద ఇద్దరు వామన్ రావుపై దాడి చేసిన సమయంలో గల బట్టలు మార్చుకుని ఒక బ్యాగ్ లో పెట్టి, దాడికి ఉపయోగించిన కత్తులను రెండింటిని సుందిళ్ల బ్యారేజీ నీటిలో పడేసి అక్కడనుండి మహారాష్ట్రకు పారిపోయారు. అయితే మహారాష్ట్ర ప్రాంతంలో తెలంగాణ పోలీస్ టీం కదలికలు ఉన్నాయని అనుమానం వచ్చిన నిందితులు మహారాష్ట్ర నుండి ముంబై వెళ్తుండగా వాంకిడి-చంద్రపూర్ మధ్యలో పోలీసులు పట్టుకున్నారు.

న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీనుల మధ్య శత్రుత్వాన్ని రేకెత్తించడానికి, హత్య చేసేందుకు గల కారణాలను ఐజీ నాగిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకు ప్రధాన ముద్దాయి కుంట శీను గుంజపడుగు గ్రామానికే చెందినవారని చెప్పారు. వీరిద్దరి మధ్య ఐదు సంవత్సరాలుగా కోల్డ్ వార్ నడుస్తోందన్నారు. న్యాయవాది వామన్ రావు ప్రతి విషయం పోలీస్ స్టేషన్ లో, కోర్టులో ఇవ్వడంతో తన ఎదుగుదలకు అతను అడ్డు వస్తున్నాడని, అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని కుంట శ్రీను నిర్ణయించుకున్నాడు. అయితే ఇటీవల గుంజపడుగులోని రామస్వామి, గోపాలస్వామి దేవాలయం మేనేజ్మెంట్ కమిటీ వివాదం, ఇల్లు నిర్మాణం, కుల దేవత పెద్దమ్మ ఆలయం నిర్మాణం ఆపడంలో అనవసర లిటిగేషన్స్ పెట్టి ఆపడం వల్ల కుంట శ్రీను తట్టుకోలేని కోపంతో, పాత కక్ష , కొత్త వివాదాలు కలిపి ఎలాగైనా వామనరావును అంతమొందించాలని కుట్ర పన్నాడు. బిట్టు శీను సహకారం కూడా తోడై ఈ హత్య చేయడానికి త్వరితగతిన నిర్ణయం తీసుకుని అమలు చేశాడని ఐజీ వివరించారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీను అనతి కాలం లోనే మండల స్థాయి నాయకుడుగా ఎదిగాడని, గతంలో ఇతనికి నేర చరిత్ర ఉందని చెబుతూ, 1997 ప్రాంతంలో సికాసలో చాలా ప్రభావశీలమైన సభ్యుడిగా ఉన్నాడన్నారు. బస్సు తగలబెట్టిన కేసులో రిమాండ్ కు వెళ్ళాడని, తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి రాజకీయాల్లోకి వచ్చాడుని, ఇంకా పలు కేసుల్లో కుంట శ్రీను నిందితుడని వివరించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు, ఇతర సాక్ష్యాల ద్వారా దర్యాప్తు చేస్తామన్నారు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్నా, ఎవరినైనా ఎంతటివారినైనా వదలబోమని నాగిరెడ్డి స్పష్టం చేశారు.

Comments are closed.

Exit mobile version