అర్థబలం, అంగబలం పుష్కలంగా ఉన్నట్లు ప్రాచుర్యంలో గల సాక్షి దినపత్రికలో ప్రయోగాలకు కొదువ ఉండదు. ఇటువంటి అనేక ప్రయోగ చర్యలు ఒక్కోసారి దాని పాఠకులనే విస్తుగొల్పుతుంటాయి. ముఖ్య పదవుల్లో వ్యక్తులు మారినప్పుడల్లా ఈ తరహా ప్రయోగాలు జరుగుతుంటాయి. తమ వింత నిర్ణయాలను పాఠకులపై బలవంతంగా రుద్ది సంస్థకు కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చిన ప్రయోగాల బాధ్యులు మరింత అందలం ఎక్కుతుంటారు కూడా. అందుకు కారణాలు అనేకం కావచ్చు.
సాక్షి పత్రిక ఆవిర్భవించిన కొత్తలో అమలు చేసిన పలు ప్రయోగాలు ఇందులో భాగమే. విదేశీ పత్రికల పోకడ పేరుతో బ్రాడ్ షీట్ల ప్రయోగంలో సంస్థ భారీ నష్టాలనే చవి చూసింది. ఇందుకు బాధ్యులైనవారు అనంతర పరిణామాల్లో సాక్షి మీడియా హౌజ్ లోని ఇతర వ్యవస్థల్లో ఎంత పెద్ద హోదాల్లోకి వెళ్లారో, ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉన్నారో సాక్షి ఉద్యోగవర్గాలకు తెలియనిదేమీ కాదు.
సరే పాత విషయాలను వదిలేసి వర్తమానంలోకి వస్తే… కరోనా కల్లోలంలో తెలుగు మీడియా సంస్థలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల కుదింపు, వంతుల వారీగా డ్యూటీ ఛార్ట్, విధుల ప్రకారమే చెల్లింపుల వంటి ప్రక్రియ టాప్ పొజిషన్లో గల పత్రికల్లో కనిపిస్తున్న దుస్థితి. ఇటువంటి కరోనా కల్లోల కడలిలోనే అత్యధిక సర్క్యులేషన్ గల ఈనాడు వంటి అగ్ర దినపత్రిక పోకడకు భిన్నంగా సాక్షి, నమస్తే తెలంగాణా యాజమాన్యాలు వ్యవహరించిన విషయమూ విదితమే.
ఈనాడు వంటి పత్రిక మెయిన్ ఎడిషన్లోనే ఒకటి, రెండు పేజీలు కేటాయించి జిల్లా వార్తలు అందిస్తున్న కరోనా పరిణామాల్లో అటు నమస్తే తెలంగాణా, ఇటు సాక్షి టాబ్లాయిడ్లను పునరుద్ధరించడం సంచలనమే. కానీ ఈ సాహసానికి తగిన ఫలితం లభించిన దాఖలాలు కనిపించడం లేదుట. బ్రాడ్ షీట్లతోనే వెలువడుతున్న ఈనాడు సంఖ్య స్థాయిలోనూ వార్తలను అందించలేకపోతున్నదట. యాడ్ రెవెన్యూ కూడా అంతంత మాత్రంగానే ఉందట. టాబ్లాయిడ్లను పునరుద్ధరించినా ప్రయోజనం లభించలేదన్నది తాజా అంచనాల విశ్లేషణగా ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో టాబ్లాయిడ్లను కొనసాగించే అంశంలో సాక్షి ముఖ్యులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తరహాలో మెయిన్ ఎడిషన్లోనే బ్రాడ్ షీట్ల రూపంలో జిల్లా వార్తలు అందించే దిశగా మళ్లీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘కాస్ట్ కటింగ్’ పేరుతో సాక్షిలో ఇప్పటికే పొదుపు చర్యలు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే కొందరు ఫొటోగ్రాఫర్లను తొలగించారు. తెలంగాణాలోని 12 జిల్లాల్లో ఆఫీసులను ఎత్తేశారు. సర్క్యులేషన్, యాడ్స్ విభాగాల్లో సిబ్బందిని కుదిస్తున్నారు. కరోనా కాలంలో.. అంటే గడచిన మూడు నెలల్లో యాడ్ రెవెన్యూ తీసుకురావడంలో విఫలమైనట్లు భావించిన సిబ్బందిని తొలగించినట్లు తాజా వార్త. డెస్క్, రిపోర్టింగ్ విభాగాల్లోనూ జర్నలిస్టుల మెడపై తొలగింపు కత్తి వేలాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏయే స్థాయిలో ఆయా జర్నలిస్టులను తొలగిస్తారనే అంశంపై ఆ సంస్థ ఉద్యోగ వర్గాల్లోనే పలు సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే…?
సాక్షి ఆవిర్భావ సమయంలో అత్యంత జాగరూకతతో ‘క్రీమ్ టీమ్’గా ఎంపిక చేసినవారిలో మెజారిటీ జర్నలిస్టులు ప్రస్తుతం ఆ సంస్థలో లేరన్నది కాదనలేని వాస్తవం. ఇందుకు సంస్థ చెప్పే కారణాలు, సంస్థను వీడిన జర్నలిస్టులు చెప్పే అంశాలకు పొంతన లేకపోవచ్చన్నది వేరే విషయం. కానీ ప్రస్తుత పరిణామాల్లో జర్నలిస్టులను తొలగించే ప్రక్రియకు సాక్షి శ్రీకారం చుడితే… అందుకు బలయ్యేదెవరు? అన్నదే ఉద్యోగ వర్గాల్లో రేకెత్తుతున్న అసలు ఆందోళన.
ఎందుకంటే అనేక వ్యవస్థల్లో ‘గాడ్ ఫాదర్’ రక్షణలేనివారు క్లిష్ట పరిస్థితులను చవి చూస్తుంటారు. ఇందుకు మీడియా సంస్థలు కూడా అతీతం కాకపోవచ్చు. ఓ ప్రెస్ నోట్ రాయడానికి అయిదారు పేపర్లు చించేసే వారు, కంట్రిబ్యూటర్ల స్టోరీలను డేట్ లైన్ మార్చి బ్యూరోలుగా కాలం గడిపేవారు గట్టి లాబీయింగుతో మీడియా హౌజుల్లో కొనసాగుతూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్లకు గాడ్ ఫాదర్ అండ ఉండొచ్చు. కానీ ఉద్యోగమే పరమావధిగా, సంస్థ మనుగడే లక్ష్యంగా పనిచేసే అనేక మంది ఉద్యోగులు ‘గాడ్ ఫాదర్’ రక్షణ లేక అన్యాయానికి గురయ్యే పరిణామాలు ఎదురవుతాయా? అనే ఆందోళన మీడియా ఉద్యోగ వర్గాల్లో సహజం.
ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల కుదింపు చర్యలు నిజమే అయితే, ప్రక్రియ వాస్తవ రూపం దాలిస్తే అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందన్నదే ‘సాక్షి’లోని పలువురు ఉద్యోగుల సందేహంగా తెలుస్తోంది. కొసమెరుపుగా ‘సాక్షి’లో సంతోషకర విషయమేమిటంటే… ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల యాజమాన్యాల తరహాలో ఉద్యోగుల వేతనాల్లో ఎటువంటి కోత విధించకుండా పూర్తి స్థాయి వేతనం చెల్లిస్తుండడం.