ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు పార్టీ నక్సల్స్ మందు పాతర పేల్చారు. ఫలితంగా 9 మంది డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు) పోలీసులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నక్సల్స్ ఏరివేతలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో పోలీసులు లక్ష్యంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్టు సమాచారం.
బీజాపూర్ జిల్లా కుట్రు అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడ్డారు. ఘటనా సమయంలో వాహనంలో 15 మంది పోలీసులు ఉండగా, పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. నడిరోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. నక్సల్స్ ఏరివేతలో ఇటీవలి కాలంలో పోలీసులదే పైచేయిగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.