‘చారానా కోడికి బారానా మసాల’ అంటే తెలుసు కదా? పావలా కోడికి, ముప్పావలా మసాలా అన్నది సామెత చెప్పే నిర్వచనం. మున్సిపల్ ఎన్నికల రణరంగంలోఈ సామెతను కాస్త తిరగేసి అన్వయించుకునే ఆసక్తికర అంశమిది. రూ. 35 వేలు ఖర్చు చేసి పేపర్లో యాడ్ ఇచ్చుకున్న అభ్యర్థి రూ. 3 వేల పన్ను బకాయి పడితే ఏమవుతుంది? కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రస్తుతం ఇదే ఉత్కంఠ నెలకొంది. అసలు విషయంలోకి వెడితే…
ఈ దిగువన గల పేపర్ యాడ్ ను నిశితంగా పరిశీలించడి. కరీంనగర్ నగరపాలక సంస్థలోని 15వ డివిజన్ నుంచి కార్పొరేటర్ పదవి కోసం పోటీ చేయడానికి తేళ్ల లక్ష్మి రమేష్ సిద్ధపడ్డారు. సరే ఎన్నికల గోదాలోకి దిగాలంటే ముందు నామినేషన్ దాఖలు చేయాలి కదా? ఈ సందర్భంగా మందీ మార్చలంతోపాటు కాస్త ప్రచారపు ఆర్భాటం కూడా అవసరమే కదా? ఇందులో భాగంగానే లక్ష్మి రమేష్ అనే మహిళ 15వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రముఖ పత్రికలో దాదాపు రూ. 35 వేల మొత్తాన్ని ఖర్చు చేసి ఈ అడ్వర్టయిజ్ మెంట్ వేయించారట. దీనికి సంబంధించి పేపర్ వాళ్లకు పేమెంట్ కూడా ఇచ్చారట. అధికార పార్టీ టికెట్ తనకే లభిస్తుందనే నమ్మకంతో నామినేషన్ దాఖలు చేసిన లక్ష్మి తాను పోటీ చేస్తున్నవార్డులో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారట. అయితే బీ ఫారం రాలేదా? అని అప్పుడే ఓ నిర్ణయానికి రాకండి. విషయం బీ ఫారాల దాకా రాలేదు లెండి.
కానీ లక్ష్మి రమేష్ దాఖలు చేసిన నామినేషన్ గురించి ఇప్పుడు తీవ్ర వివాదం ఏర్పడడమే అసలు విశేషం. ఇంతకీ విషయమేమిటంటే రూ. 35 వేలు ఖర్చు పెట్టి పత్రికలో ప్రచారపు ప్రకటన ఇచ్చుకున్న లక్ష్మి రమేష్ తన ఇంటి పన్నును, నల్లా బిల్లును చెల్లించలేదనే ఆరోపణలు వచ్చాయి. నగర పాలక సంస్థకు దాదాపు రూ. 3 వేల పన్ను బకాయి పడినట్లు ఆరోపణల సారాంశం. దీంతో లక్ష్మి రమేష్ నామినేషన్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎటువంటి పన్నులు బకాయి ఉండరాదు. అయితే తేళ్ల లక్ష్మి రమేష్ ఒక ఇంట్లో ఉంటూ, మరో ఇంట్లో ఓటు హక్కును కలిగి ఉన్నారని, ఆమె నల్లా బిల్లును బకాయి పడ్డారని, తగిన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్ పి. సత్యనారాయణ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అందువల్ల ఆమె నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారిని కోరారు.
ఇదిలా ఉండగా తాము ఎటువంటి పన్నులు బకాయి లేమని, అంతా క్లియర్ గానే ఉందని లక్ష్మి భర్త రమేష్ ts29తో చెప్పారు. తమ ఓటు హక్కు గల ఇంటిని మూడేళ్ల క్రితమే విక్రయించామని, కొనుగోలుదార్లు ముటేషన్ కూడా చేయించుకున్నారని, ఆ ఇంటిపై రూ. 40 లక్షల రుణం కూడా తీసుకున్నారని వివరించారు. తాము ఏ బకాయిలు లేమని, అన్నీ క్లియర్ గానే ఉన్నాయని, వాడకట్టుకు చెందిన కొందరు దురుద్ధేశపూర్వకంగా నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు ప్రచారం చేస్తున్నారని రమేష్ వివరించారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ నగర పాలక సంస్థలో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను అధికారులు ప్రకటిస్తారు.