ఫొటో చూశారు కదా? ’లొట్ట పీసు’ చెట్టు అంటే ఇదే.. తెలంగాణాలో, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ‘సలేంద్ర’ చెట్టుగా దీన్ని పిలుస్తారు. “ఇపోమియా కార్నియా”గా శాస్త్రీయ నామంలో వ్యవహరించే ఈ లొట్ట పీసు చెట్టును రబ్బర్ చెట్టుగా కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకొందరు వ్యవహరిస్తారు.
ఓ పట్టాన ఈ చెట్టు చావదు. ఒక్కసారి మొలిచిందంటే ఎటుపడితే అటు విస్తరిస్తుంది. దీన్ని చంపడం చాలా కష్టం. దహనం చేసినా కూడా చావదు. ఏ మాత్రం అవశేషం మిగిలి ఉన్నా మళ్ళీ మొలకెత్తుతుంది. నీళ్ళు లేని భూమిలో కూడా ఇది బతుకుతుంది. ఈ చెట్టు కర్ర లోపలి భాగం మొత్తం బూర.. లోన ఏమీ ఉండదు. కానీ చావదు. తమ పొలాల్లో వేళ్లూనుకున్న ఈ లొట్టపీసు చెట్టును నాశనం చేసేందుకు రైతులు నానా యాతన పడుతుంటారు.
విదేశీ మూలాలున్న ఈ లొట్టపీసు చెట్టు మనదేశంలోనే కాదు, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లోనూ వేళ్లూనుకుని విస్తరించింది. ప్రాంతాన్ని బట్టి పెరిగే స్వభావమున్న చెట్టు ఇది. నిటారుగానే కాదు, పరుచుకుంటూ భూమిని ఆక్రమిస్తుంది. కలర్ ఫుల్ పువ్వులు కూడా పూసే ఈ చెట్టు అత్యంత విషపూరితం కూడా. అయితే వివిధ ఔషధ గుణాలు కూడా ఈ చెట్టులో ఉన్నట్లు అనేక వార్తా కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. కరోనా వంటి మహమ్మారికి విరుగుడుగా ఆయుర్వేద వైద్యులు కొందరు లొట్టపీసు చెట్టు రసాయనాన్ని వాడినట్లు చెబుతుంటారు.
ఏరకంగా చూసినా ’లొట్టపీసు’.. అని తీసిపారేసే చెట్టు మాత్రం కాదన్న మాట. ఎక్కువ శాతం ఈ చెట్టు ‘డేంజర్’ అనేందుకు మూలాలు అనేకం.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును ఉద్దేశించి అదో “లొట్ట పీసు” కేసు.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఈ చెట్టు తాజాగా వార్తల్లోకి వచ్చింది. ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేసీఆర్ వ్యాఖ్యలను దిగువన గల వీడియోలో చూడవచ్చు..