సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటో చూపుతూ ‘వకీల్ సాబ్’గా హెడ్డింగ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? పూర్వాశ్రమంలో ఆయన లాయర్ సాబే లెండి. తనకు ఇంజనీర్ కావాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, తండ్రి మాట కాదనలేక ‘లా’ చేసి అడ్వకేట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన అనుభవం కూడా ఉన్న ‘వకీల్ సాబ్’ అన్నమాట. పంచాయతీ సమితి అధ్యక్షుని నుంచి ఎక్సైజ్, ఆర్ అండ్ బీ శాఖల మంత్రి వరకు ఎదిగిన రాజకీయ నేపథ్యం జీవన్ రెడ్డి సొంతం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1983లో జగిత్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించిన జీవన్ రెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గంలోనే సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో విభేదించి 1984లో కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవన్ రెడ్డి రాజకీయ పయనం కాంగ్రెస్ తోనే సాగుతోంది. అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డిది పదే పదే పార్టీలు మార్చే రాజకీయ వ్యక్తిత్వం కాదు. కాంట్రాక్టులు, కార్పొరేట్ వ్యాపారాలతో ముడిపడిన రాజకీయ జీవితం కాదు. పక్కా పొలిటీషియన్. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా, ఎవరిపైనైనా పోటీ చేసేందుకు వెనుకాడరు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పైనే 2006, 2008 ఎన్నికల్లో ఎంపీగా తలపడిన రాజకీయ నేపథ్యం. కేవలం 1,4000 వేల తేడాతో కేసీఆర్ పై విజయం జీవన్ రెడ్డికి తృటిలో తప్పింది. రాష్ట్ర విభజన అనంతరం ఉత్తర తెలంగాణాలో కాంగ్రెస్ విజయం సాధించిన ఏకైన స్థానం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల నియోజకవర్గం. కాబోయే పీసీసీ చీఫ్ గా వార్తల్లో గల జీవన్ రెడ్డి గురించి ఇప్పుడీ ఉపోద్ఘాతం దేనికంటే…?
నిన్న ఇద్దరు జీవన్ రెడ్డిల మధ్య ఆసక్తికర రాజకీయ సంభాషణ జరిగింది. అందులో ఒకరు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మెన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కాగా, మరొకరు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి. తన ఆఫీసు పక్కనే గల సీఎల్పీ కార్యాలయం వైపు వెడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీ తాగి వెళ్లాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ‘మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నావ్?’ అంటూ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆశన్నగారి జీవన్ రెడ్డిని ప్రశ్నించగా, అంతా మీ అభిమానం అని ఆయన అన్నారు. ఈ సంభాషణ కొనసాగింపులో భాగంగా ‘పెద్దాయన కేసీఆర్ ను అప్పుడే దించేస్తారా? కేసీఆర్ ప్రధాని అయ్యాక కేటీఆర్ సీఎం గురించి మాట్లాడొచ్చు కదా? అప్పుడే కేసీఆర్ ను ఎందుకు దించాలనుకుంటున్నారు? అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సరదాగా ప్రశ్నించినట్లు వార్తా కథనాల సారాంశం.
ఇది సరదా సంభాషణే కదా? ఏముందీ ఇందులో అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి వాక్చాతుర్యంలోని చమత్కారమే అంత. తాను విసిరే వ్యాఖ్యల్లోని వ్యంగ్యార్థంలో కాస్త సానుభూతి కనిపిస్తుంది. కానీ అది సానుభూతి తరహాలో మాత్రం గోచరించదు. అలాగని పూర్తిగా వ్యంగార్థంగానూ స్ఫురించదు. కేటీఆర్ ను సీఎం కావద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన వ్యాఖ్యల్లో ఆక్షేపించలేదు. ఇంకా లోతుల్లోకి వెళ్లి రాజకీయ విమర్శలు కూడా చేయలేదు. కానీ కేసీఆర్ ప్రధాని అయ్యాక కేటీఆర్ ను సీఎం చేయాలని స్పష్టంగా పేర్కొనడమూ లేదు… కేసీఆర్ ప్రధాని అయ్యాక కేటీఆర్ ను సీఎం చేసే అంశం గురించి మాట్లాడొచ్చు కదా? అని మాత్రమే అంటున్నారు. అదీ ఈ వకీల్ సాబ్ కమ్ పొలిటీషియన్ తాటిపర్తి జీవన్ రెడ్డి వ్యాఖ్యల్లోని అసలు ‘శెమత్కారం’. ఇందులోని భావార్థం మీకు బోధపడినట్లే కదా! అర్థం కాకుంటే తాటిపర్తి జీవన్ రెడ్డి తన సరదా సంభాషణలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ ఓసారి నిశితంగా చదవండి.