అసలే సర్కార్ వారి లిక్కర్ షాపు. లక్షలాది రూపాయల లిక్కర్ నిల్వల భద్రతే ప్రామాణికంగా సిమెంట్ రేకులో, స్టీల్ రేకులో తెలియదుగాని పకడ్బందీగా నిర్మించినట్లున్నారు. అదేదో కంపెనీ ఆస్బెస్టాస్ రేకుల గురించి చిన్నప్పటి నుంచీ రేడియోల్లో వినిపించే అడ్వర్టయిజ్ మెంట్ గురించి ఐడియా ఉంది కదా? అటువంటి రేకులతో సర్కార్ మద్యం షాపు షెడ్లను ఆంధ్రప్రదేశ్ లో పకడ్బందీగా, పది కాలాలపాటు మన్నికగా ఉండేలా నిర్మించినట్లున్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణం. అసలే లాక్ డౌన్ పరిస్థితులు. డబ్బు పెట్టి సరుకేం కొంటాం? అని భావించినట్టున్నాడు ఓ చోరశిఖామణి. ఇంకేముంది అర్థరాత్రి దాటాక తెల్లవారుజామున 3 గంటలకు లిక్కర్ షాపు రేకులను పగుల గొట్టి లోపలికి దూరాడు. రేకుల పైన మరో దొంగ కూడా ఉన్నట్టున్నాడు. లోనికి ప్రవేశించిన దొంగ లిక్కర్ కార్టన్లను రేకులపై గల మరో దొంగకు అందిస్తున్నట్లు వీడియోలో గోచరిస్తోంది. కానీ బీర్ల కార్టనో, లేదంటే ఖరీదైన ఇతర మద్యం బాటిళ్లో తెలియదుగాని దొంగ చేతికి చిక్కనట్టుంది. పక్కనే గల ఇనుప రాడ్ కాబోలు… చేతిలోకి తీసుకుని బాదేశాడు. మద్యం బాటిళ్లు భల్లుమంటూ పగిలిపోయాయి. నేను ప్రయత్నిస్తే రావా? అంటూ ఆగ్రహంతో, అసహనంతో దొంగ వాటిని కాలితో తన్నుతున్న సీన్ కూడా వీడియోలో కనిపిస్తోంది.
మొత్తానికి సర్కార్ లిక్కర్ షాపు నుంచి రూ. 86 వేల విలువైన మద్యాన్ని దొంగ దోచుకుపోయాడు. విజయవాడ-ఆగిరిపల్లి వెళ్లే మార్గంలోని రోడ్డు పక్కనే గల వైన్ షాపులో జరిగిన ఈ చోరీ ఘటనలో పోలీసులు ఏం చేశారు? అంటే… ఇదిగో ఇలా ప్రకటన జారీ చేశారు. ఆకర్షణీయ నగదు బహుమతిని కూడా ప్రకటించారు. పూర్తి వివరాలకు దిగువన మీరే చదవండి.
మద్యం షాపులో చోరీ చేసిన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి 10 వేల రూ పారితోషకం
కృష్ణా జిల్లా పోలీసు శాఖ
పై వీడియోలోని వ్యక్తి ది 05/06-05-2020 రాత్రి ఆగిరిపల్లి నుండి విజయవాడ వెళ్ళు రహదారి పక్కనున్న ప్రభుత్వ మద్యం దుకాణం పైన ఉన్నటువంటి రేకులను పగులగొట్టి పైనుండి వైన్ షాపులోకి ప్రవేశించి షాపులో ఉన్న 86 వేల రూపాయల విలువ చేసే మద్యం బాటిల్స్ ను దొంగతనం చేయడం జరిగినది.
పై వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినవారి వివరములు గోప్యంగా ఉంచబడును.
మరియు వారికి తగిన బహుమతి 10,000 రూ. కూడా ఇవ్వబడును. మీరు సమాచారం ఈ క్రింది నంబర్లకు ఇవ్వగలరు.
డిఎస్పి నూజివీడు శ్రీనివాసులు
9440796408
సీఐ హనుమాన్ జంక్షన్. 8332983804.
ఎస్సై ఆగిరిపల్లి. 9440796444
Murali Krishna
DSP CCS Krishna
8332983793