ప్రధానమంత్రి అవార్డులకు సంబంధించిన సవరణలపై సలహాలు ఇచ్చే ప్యానెల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కష్ణ భాస్కర్ కు చోటు లభించంది. ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ఫలితాలు చూపినందుకు అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఎక్సలెన్స్ అవార్డులను ఏటా సివిల్ సర్వీసెస్ దినోత్సవం రోజున ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే 2020 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డులకు సంబంధించిన సవరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేవలం 15 జిల్లాల కలెక్టర్లకు ఆహ్వానం పంపింది. ఈనెల 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది.
దేశ వ్యాప్తంగా మొత్తం 732 జిల్లాలు ఉండగా, 15 జిల్లాల కలెక్టర్లకు మాత్రమే ప్రధాన మంత్రి అవార్డులకు సంబంధించిన సవరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడం గమనార్హం. దక్షిణ భారతదేశం నుంచి 4 జిల్లాల కలెక్టర్లకు ఈ ఆహ్వానం అందింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖపట్నం కలెక్టర్ కు ఈ అవకాశం లభించగా, తెలంగాణ రాష్ట్రం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు ఈ అరుదైన అవకాశం దక్కింది. కొత్త జిల్లాల పరంగా చూసుకుంటే ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కావడం విశేషం.
ఈమేరకు గ్రామీణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధికి సంబంధించి ప్రధానమంత్రి అవార్డుల్లో చేపట్టాల్సిన సవరణలు, సూచనలను పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.
ఈ అరుదైన ఆహ్వానం అందిన జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి రాజన్న సిరిసిల్ల, విశాఖపట్నం కలెక్టర్లతో పాటు సోలాన్ (హిమాచల్ ప్రదేశ్ ), ఉడుపి ( కర్ణాటక), ఈస్ట్ కాసి హిల్స్, షిల్లాంగ్ (మేఘాలయ), బికానర్ (రాజస్థాన్), జాన్ పూర్ (ఉత్తర ప్రదేశ్), బరసాత్ నార్త్ 24 (వెస్ట్ బెంగాల్ ), ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ (మణిపూర్), నాగాన్ (అస్సాం), బంకా (బిహార్), పత్తనమ్ తిట్ట (కేరళ), బనస్కాంతా (గుజరాత్ ) జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.