తెలంగాణా జనసమితి అధ్యక్షుడు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందించారు. నల్లగొండలోని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవాంతరాలు సృష్టించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పథకరచన చేసినట్లు తమకు వేర్వేరు వర్గాల ద్వారా సమాచారం అందిందని పేర్కొన్నారు. తద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల అధికారులపై ఒత్తిడి పెంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు వేర్వేరు నివేదికల ద్వారా సంకేతాలు ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషనర్ ను అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా నల్లగొండలోని ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు ఆందోళనకు దిగారు. ఎనిమిది బ్యాలెట్ బాక్సులకు సీల్ లేదని, వాటి తాళం చెవులు కూడా కనిపించలేదని సుమారు 35 మంది ఏజెంట్లు నిరసనకు దిగారు. రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు ఏజెంట్లు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయా బాక్సులకు సంబంధించి ఓట్ల లెక్కింపుపై ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోదండరామ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు ప్రాధాన్యతను సంతరించుకుంది. కోదండరామ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు ప్రతిని దిగువన చూడవచ్చు.