ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార పార్టీ ఏదేని ట్విస్ట్ ఇవ్వబోతున్నదా? ఆదివారం ముగిసిన నామినేషన్ల పర్వంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇదే సందేహాన్ని కలిగిస్తోంది. ఈనెల 30న జరిగే మినీ మున్సిపల్ పోరులో ఖమ్మం నగరపాలక సంస్థకు కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జనరల్ మహిళకు రిజర్వు చేసిన మేయర్ పదవికి అధికార పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ఓ ముఖ్యనేత సతీమణి పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అధికారికంగా మాత్రం ఆమె పేరును ఎక్కడా ఇప్పటి వరకు పార్టీ ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యనేత సతీమణి తరపున పార్టీ నాయకులు కొందరు నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆమె మాత్రం నామినేషన్ దాఖలుకు స్వయంగా హాజరు కాకపోవడం విశేషం. ఆదివారం మరో సెట్ ఆమె స్వయంగా దాఖలు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ నిన్నటి నామినేషన్ సెట్ తోనే సరిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆమె ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించరని, నేరుగా మేయర్ సీటులో ఆసీనులయ్యే విధంగా పార్టీ నాయకులు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు చేశారనే ప్రచారం కూడా ఉంది. అంతేగాక ఆమె కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నికవుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులు ఇదే డివిజన్ నుంచి నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు 22వ తేదీ వరకు పరిస్థితిలో మార్పు వస్తుందా? టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేత సతీమణి ఏకగ్రీవంగా ఎన్నికవుతారా? లేదా? అనేది వేరే విషయం.
ఈ నేపథ్యంలోనే మేయర్ అభ్యర్థిగా ప్రాచుర్యంలోకి వచ్చిన ముఖ్యనేత సతీమణి నామినేషన్ దాఖలు చేసిన డివిజన్ నుంచే టీఆర్ఎస్ కు చెందిన మరో మహిళా నేత ఆదివారం నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. వాస్తవానికి ఈమె నిన్ననే పక్కనే గల మరో డివిజన్ లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ డివిజన్ లో ఇంకొకరికి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ముఖ్యనేత సతీమణి పేరున నామినేషన్ దాఖలైన డివిజన్ నుంచే ఈమె కూడా తాజాగా తన నామినేషన్ దాఖలు చేయడమే అసలు ట్విస్ట్. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరిగిందనే అంశంపైనే అధికార పార్టీ వర్గాలు భిన్న కోణాల్లో ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. కాగా ముఖ్యనేత సతీమణి పేరును మేయర్ అభ్యర్థిగా పార్టీ అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.