ఖమ్మం ‘బిగ్ షాట్స్’ గా ప్రాచుర్యం పొందిన అనేక మంది ఆర్థికంగా కుదేలవుతున్నారు. కొందరు ‘దివాళా’ (ఐపీ) ప్రకటిస్తున్నారు.. మరికొందరు ఉన్నట్టుండి ‘మాయం’ అవుతున్నారు. ఏ చిన్నా, చితకా వ్యక్తులో కాదు దాదాపు అందరూ ప్రముఖులే. వీళ్లంతా ఏ బడ్డీ కొట్టు వ్యాపారులో కాదు.. బడా బిజినెస్ మేన్లే.. సబ్ కాంట్రాక్లర్లు కానే కాదు.. క్లాస్ వన్ కాంట్రాక్టర్లే.. కమిషన్ పై బ్రోకర్ గిరి చేసే వారు కాదు.. ఖమ్మం ‘రియల్ కింగ్’లుగా పేరు తెచ్చుకున్నవారే.. ట్యూషన్లు చెప్పుకుంటున్న మామూలు వ్యక్తులు కాదు.. నంబర్ వన్ కాలేజీలుగా ఎదిగినవారు..స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు కాదు.. ఖమ్మం ఫుడ్ బిజినెస్ లో బడా బాబులుగా ఎదిగినవారే.. ఆ రంగం ఈ రంగం కాదు.. దాదాపు అన్ని ప్రముఖ రంగాల్లో వీరిది ఆర్థిక దివాళా? లక్షో పది లక్షలో కాదు.. వందల కోట్ల రూపాయల మేర అప్పులు చేసి ముఖం చాటేస్తున్నారు. ఖమ్మం ‘బిగ్ షాట్స్’కేమైంది? అసలేం జరుగుతోంది? వీళ్లకు అప్పులిచ్చిన వ్యక్తులు నెత్తిన గుడ్డ వేసుకోవలసిందేనా? ఇదీ ఇప్పుడు ఖమ్మం నగరంలో జోరుగా సాగుతున్న చర్చ.
రాష్ట్ర వ్యాప్తంగా గతమెంతో ఘనకీర్తిని సంపాదించుకున్న ఖమ్మం వాణిజ్య రంగంలో నిజానికి ఇది భారీ కుదుపుగానే పరిశీలకులు భావిస్తున్నారు. దివాళా తీస్తున్న ప్రముఖ వ్యాపారుల్లో, కాంట్రాక్టర్లలో, చిట్ ఫండ్ నిర్వాహకుల్లో కొందరు చట్టపరంగా ఐపీ దాఖలు చేస్తుండగా, మరికొందరు సెటిల్మెంట్ ‘దందా’ను నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సెటిల్మెంట్ దందాల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. గడచిన మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా వంద కేసులకు పైగా ఐపీ పిటిషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఈఏడాది ఇప్పటికే డజనుకుపైగా కేసులు దాఖలైనట్లు సమాచారం. ఐపీ దాఖలు చేస్తున్న ఘటనల్లో అప్పులిచ్చినవారు షాక్ కు గురవుతున్నారు. ఐపీ దాఖలు చేయకుండా సెటిల్మెంట్ దందాకు దిగిన వ్యాపారులు 80 నుంచి 70 శాతం వరకు అప్పులు ఎగ్గొట్టే దిశగా పయనిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిన్నా, మొన్న వార్తల్లోకి వచ్చిన ఇద్దరు ‘ప్రముఖ’ వ్యాపారులే కాదు..అంతకు ముందు నేపథ్యంలోనూ ఖమ్మం బిగ్ షాట్స్ గా పేరు తెచ్చుకున్న అనేక మంది ఆర్థికంగా కుదేలైన తమ సంస్థలకు ప్రధాన షట్టర్లు దించేశారు.
ఓ ప్రభుత్వ రంగ సంస్థలో చిన్న చిన్న మరుగుదొడ్లు నిర్మించి కాంట్రాక్టరుగా జీవితాన్ని ప్రారంభించిన ఓ ప్రముఖుడు తర్వాత ప్రస్థానంలో అంతర్ రాష్ట్ర కాంట్రాక్టరుగా ఎదిగారు. ఆకస్మాత్తుగా వేలాది కోట్ల రూపాయల అతని కాంట్రాక్టు సామ్రాజ్యం కుప్పకూలింది. దీని వెనుక గల కారణాలేమిటనేది అంతుబట్టని రహస్యంగానే మిగిలింది. అదేవిధంగా ప్రయివేట్ కళాశాలలను ఏర్పాటు చేసి బిగ్ షాట్స్ గా ఓ వెలుగు వెలిగిన ఐదారుగురు ప్రముఖులు ఇప్పుడు విద్యారంగంలోనే లేకుండాపోయారు. రియల్ ఎస్టేట్ రంగంలో తలదూర్చిన ఫలితంగా ఈ విద్యా సంస్థల నిర్వాహకులు భారీ కుదుపునకు గురైనట్లు చెబుతుంటారు. మరో లాబ్ నిర్వాహకుడు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇతన్ని నమ్మి పెద్ద ఎత్తున అప్పులిచ్చినవారు కుదేలయ్యారు. అంతకు ముందు ఓ ప్రముఖ వస్త్ర బ్రాండ్ ఫ్రాంచైసీ గల ప్రముఖ వ్యాపారి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఐపీ పెట్టారు. ఇంకో ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య ఘటన కూడా ఖమ్మం ఛాంబర్ వర్గాల్లో తీవ్ర కలవరం కలిగించింది. గడచిన ఐదారేళ్లలో రుణదాతల నెత్తిన గుడ్డ వేసిన బిగ్ షాట్స్ సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ప్రముఖ హోటల్ యాజమాన్యం, ఇంకో చిట్ ఫండ్ నిర్వాహకులు కూడా అష్టకష్టాల్లో ఉన్నారని, ఐపీ దాఖలు దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం బిగ్ షాట్స్ గా, ప్రముఖ వ్యాపారులుగా పేరుగాంచిన అనేక మంది ఆర్థికంగా దివాళా తీయడం వెనుక సహజమైన కారణాలే ఉన్నట్లు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొందరు ఒకే రంగాన్ని పూర్తిగా నమ్మకుని, ప్రత్యామ్నాయ వనరులు లేకుండా, ఆర్థికంగా దివాళా తీసినట్లు చెబుతున్నారు. మరికొందరు సజావుగా సాగుతున్న తమ విద్యా సంస్థలను సక్రమంగా నిర్వహించకుడా, పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందంగా ‘రియల్’ రంగంలోకి ప్రవేశించి భారీ నష్టాలను మూటగట్టుకున్నట్లు జనంలో చర్చ జరుగుతోంది. ఇంకొందరు జనం నుంచి పెద్ద ఎత్తున అప్పులు స్వీకరించి హైదరాబాద్ వంటి మహానగరాల్లో పెట్టుబడులు పెట్టి టర్నోవర్ పరంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతిలో రియల్ పెట్టబడులు పెట్టి పెద్ద ఎత్తున ఆర్థిక దివాళా తీసినట్లు పేర్కొంటున్న ప్రముఖ వ్యాపారుల గురించి భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇదే దశలో దివాళా తీసినట్లు ప్రచారం చేయించుకుంటున్న బిగ్ షాట్స్ లేదా ప్రముఖ వ్యాపారులు ప్లాన్ ప్రకారమే వ్యవహరిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. అప్పులిచ్చిన వ్యక్తులను నిండా ముంచడానికి ముందస్తు వ్యూహం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం ఖమ్మం వ్యాపార రంగాన్ని షేక్ చేస్తున్నాయని వర్తక వర్గాలు చెబుతున్నాయి.