గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భావిస్తున్న తరుణంలో, సొంత పార్టీకే చెందిన ఓ ముఖ్యనేత సోషల్ మీడియా విభాగం ఆయనను టార్గెట్ గా చేసుకుని చేస్తున్న పోస్టులు తీవ్ర చర్చకు దారి తీశాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుల నాయకత్వంలో, ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్న సోషల్ మీడియా వింగ్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని ఆయన ఇమేజ్ ను డామేజ్ చేస్తుండడం ఆ పార్టీ వర్గాల్లోనే కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని టీఆర్ఎస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుల సేవలను ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘కమ్మ’ సామాజిక వర్గంలో గట్టి పట్టు గల తుమ్మల సేవలను వీలైనంతవరకు వినియోగించుకోవాలని పార్టీ చీఫ్ కేసీఆర్ సైతం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే తాజా రాజకీయ పరిణామాల్లో ‘తుమ్మల’కు మళ్లీ ప్రాధాన్యత పెరిగిందంటున్నారు. అయితే ఇదే దశలో తుమ్మల ఇమేజ్ ను డామేజ్ చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలే కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకోవడం గమనార్హం. తమ పార్టీకి చెందినవారే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు నిన్న స్వయంగా ప్రకటించారు. నగర పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించిన ఐదుగురు వ్యక్తులు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడం విశేషం.
ఎవరీ ఐదుగురు వ్యక్తులు?
సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిలువరించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా నిన్న ఖమ్మం పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించడం సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై గతంలో కూడా తుమ్మల ఫిర్యాదు చేసినప్పటికీ, అప్పట్లో ఆయన స్వయంగా కమిషనరేట్ కు రాలేదు. తుమ్మల అనుచరులు మాత్రమే వచ్చి ఫిర్యాదును అధికారులకు అందజేశారు. కానీ ఈసారి తుమ్మల స్వయంగా పోలీస్ కమిసనరేట్ కు వచ్చారంటే, సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన ఎంతగా మనోవేదనకు గురై ఉంటారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుమ్మల తన ఫిర్యాదులో పేర్కొన్న అయిదుగురు వ్యక్తులు కూడా అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతకు చెందిన సోషల్ మీడియా వింగ్ ముఖ్య కార్యకర్తలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సోషల్ మీడియా విభాగాన్ని నామినేటెడ్ పదవిలో గల మరో నాయకుడు స్వయంగా నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తుమ్మల ‘టార్గెట్’ దేనికంటే..?
ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తన ‘ఇమేజ్’ను పెంపొందించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్న ఈ సోషల్ మీడియా వింగ్ తుమ్మల నాగేశ్వరరావునే ఎందుకు టార్గెట్ చేసింది? ఇదీ తాజా ప్రశ్న. వాస్తవానికి తుమ్మలకు సీఎం కేసీఆర్ తో నేరుగా సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు ఈ ఇద్దరి మధ్య గల స్నేహమే పార్టీలో తుమ్మలకు ప్రాధాన్యత దక్కడానికి కారణమంటున్నారు. అందువల్లే 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన తుమ్మలకు మంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత కల్పించారంటున్నారు. తనకు ఇంతగా గౌరవం ఇచ్చిన కేసీఆర్ ను కాదని, తాను వేరే పార్టీలోకి మారే ప్రసక్తే లేదని తుమ్మల కూడా నిన్ని మీడియాతో స్పష్టం చేశారు. ఇటువంటి పరిణామాల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతకు చెందిన సోషల్ మీడియా విభాగం తుమ్మల నాగేశ్వరరావును ఎందుకు టార్గెట్ చేసందనే అంశంపై భిన్న ప్రచారం సాగుతోంది. రాజకీయంగా తుమ్మల పని అయిపోయిందని, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనే సంకేతాలను పార్టీ చీఫ్ కు పంపడానికే తుమ్మలను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారంటున్నారు. అందువల్లే తుమ్మల బీజేపీలోకి వెడతారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ ముఖ్య నేతకు చెందిన సోషల్ మీడియా వింగ్ భుజాన వేసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పోస్టుల ‘రాతగాళ్లు’ ఆ ఇద్దరు జర్నలిస్టులా?
తమ నేతను ‘టార్టెట్’గా చేసుకుని సోషల్ మీడియాలో సాగిన దుష్ప్రచారపు పోస్టుల్లోని రాత వెనుక ఇద్దరు జర్నలిస్టుల పాత్ర ఉందనే అనుమానాన్ని తుమ్మల అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టుల్లో వాడిన పరిభాష, పదజాలం, వాక్యనిర్మాణం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతకు చెందిన సోషల్ మీడియా విభాగపు నిర్వాహకుల వల్ల అయ్యే పని కాదంటున్నారు. ఓ ప్రముఖ పత్రిక, మరో ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెందిన ఇద్దరు జర్నలిస్టుల పాత్ర ఈ రాతల వెనుక ఉందని తుమ్మల అనుచరులు భావిస్తున్నారు. ఈ విషయంలో తమకు స్పష్టమైన సమాచారం ఉందని, ఆయా ఇద్దరు విలేకరుల ‘రాజకీయ పాత్ర’పై సంబంధిత మీడియా సంస్థల యాజమాన్యాలకు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా తుమ్మల అనుచరగణం చెబుతోంది. మొత్తంగా తుమ్మలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం వెనుక పెద్ద తతంగమే ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.