అధికార పక్షంలో ‘అనధికార’ పక్షం నేతల సంఖ్య పెరుగుతున్నదా? ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఈ పరిణామం రోజురోజుకూ తీవ్రతరమవుతున్నదా? అనే ప్రశ్నలపై అధికార పక్షంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం డీసీసీబీ నిధుల మళ్లింపు వివాదంలో ఆ బ్యాంకు మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు ఏమంటున్నారు? ‘అధికార పార్టీలో ఉన్నప్పటికీ, అనధికారపక్షంలో ఉండడం వల్లే వేధింపులకు గురవుతున్నామని నిన్నటి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. డీసీసీబీ నిధుల వ్యవహారంలో విచారణ నివేదిక వచ్చిన తెల్లవారే ఆగమేఘాలపై మహాజన సభను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని తీర్మానించడం, అర్థరాత్రి వేళ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘నేను టెర్రరిస్టునా? హత్య చేశానా? అని కూడా విజయ్ బాబు ప్రశ్నించారు. డీసీసీబీ నిధుల మళ్లింపు వివాదం, పోలీసు కేసు తదితర అంశాలు చట్టం పరిధిలోకి వెళ్లాయనేది వేరే విషయం. కానీ తాను అనధికార పక్షంలో ఉండడం వల్లే వేధిస్తున్నారని విజయ్ బాబు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతకీ అధికార పక్షంలో అనధికార పక్షం అనే పదాలకు అసలు నిర్వచనం ఏమిటి? ఎవరు ఎవరిని వేధిస్తున్నారు? ఎందుకు వేధిస్తున్నారు? ఇదీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తాజా చర్చ. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలను క్తుప్తంగా ఓసారి మననం చేసుకుంటే అసలు అధికార పక్షంలో జరుగుతున్నదేమిటి? ఎవరి వల్ల ఎవరు వేధింపులకు గురవుతున్నారు? దాని పరిణామాలు పార్టీపై ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి? అనే అంశాలు కూడా రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా గడచిన ఏడాది కాలంలో రెండుసార్లు పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తుమ్మల స్వయంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ప్రస్తావించిన కొందరి పేర్లు అధికార పార్టీకి చెందినవారే ఉండడం గమనార్హం. అదేవిధంగా ఇటీవలి ఓ ఘటనలో ఎంపీ నామా నాగేశ్వర్ రావు ముఖ్య అనుచరునిపైనా పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టు ఒకటి ఇందుకు కారణం కావడం గమనార్హం.
అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇటీవలి కాలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నేను బతికినంత కాలం పార్లమెంట్ సభ్యునిగా ఉంటాననో, మంత్రిగా ఉంటాననో, బతికినంతకాలం ఉన్నతమైన స్థానంలో కూర్చుంటానంటే అది పొరపాటు. ప్రజలు మార్పు కోరినపుడు, పార్టీలో పెద్దలు మార్పు చేయాలని అనుకున్నపుడు తప్పకుండా మార్పు జరుగుతుంది. మార్పు జరిగినపుడు నిలదొక్కుకున్నవాడే ప్రజానాయకుడు అని నేను నమ్ముతాను, అదే బాటలో నేను పయనిస్తున్నాను. అధికారం ఎప్పుడూ, ఎవరికీ శాశ్వతం కాదు. అధికార మైకంలో తప్పులు చేస్తే, తప్పునకు శిక్షకు అర్హులు వాళ్లు. అధికారమే ఉందని, అహంకారపూరితంగా నడుచుకుంటే ప్రజలిచ్చే తీర్పునకుగాని, జరిగే పరిణామాలకుగాని వారే బాధ్యులవుతారు. అధికారమనేది అప్ అండ్ డౌన్, ఒక సముద్రంలో అలలాగా… కిందపడ్డ అల తప్పకుండా పైకిలేస్తది. పైనలేచిన అల కిందకు దిగుతది. ఇది నేను వేదాంతం చెప్పడం కాదు, సృష్టిని చూస్తున్నాం, వందల సంవత్సరాలుగా పురాణాల నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఎప్పుడు ఏదీ, ఎవరికీ శాశ్వతం కాదనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. దాన్ని పూర్తిగా నేను నమ్ముతాను.’’ అని పొంగులేటి మూడు నెలల క్రితం ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తన బర్త్ డే ఫ్లెక్సీలను సైతం హోర్డింగులపై నిలబెట్టుకోలేని ‘అనధికార’’ పక్షంలో పొంగులేటి కొనసాగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అధికార పక్షానికే చెందిన బీసీ నాయకుడు గాయత్రి రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్రది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని బీసీ సామాజికవర్గంలో గట్టి పట్టుగల గాయత్రి రవి తన బర్త్ డే ఫ్లెక్సీలను సైతం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయలేని ప్రతికూల పరిస్థితిని ఎదుర్కుంటున్నారని ఆయన అనుయాయులు, అభిమానులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీతో తెంచుకుని అధికార పక్షంలో చేరినప్పటికీ, గాయత్రి రవి అంతర్గతంగా అనేక ఇక్కట్లకు, ఇబ్బందులకు గురవుతున్నారంటున్నారు. చివరికి తన అనుయాయులను లక్ష్యంగా చేసుకుని పోలీసు కేసులు పెడుతున్న నేపథ్యంలో గాయత్రి రవి కూడా అధికారపక్షంలో ‘అనధికార’ పక్షంలోనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పార్టీ నేతల సంగతి ఎలా ఉన్నప్పటికీ, అధికార పార్టీతో గట్టి అనుబంధం గల ఇతర సంఘాల నేతలు సైతం ‘అనధికార’ పక్షపు ప్రతికూల పరిణామాలను చవిచూస్తున్న దాఖలాలు ఉండడం గమనార్హం. టీఎన్జీవో సంఘం రాష్ట్ర నేత, ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసరావు ఘటన నుంచి తాజాగా జర్నలిస్టు సంఘం నాయకుడిపై నమోదైన కేసుల ఘటనలను కూడా పలువురు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏలూరి శ్రీనివాసరావుతోపాటు అధికార పక్షానికి అనుబంధ సంస్థగా ప్రాచుర్యం పొందిన జర్నలిస్టు సంఘం నాయకుడు కూడా కేసులను ఎదుర్కుంటున్న స్థితి. జర్నలిస్టు సంఘం జిల్లా నేతపై పోలీసులు ‘కుట్ర’ కేసు నమోదు చేసిన పరిణామాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మాారాయి. మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ కూడా జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వర్గీయులే జర్నలిస్టు సంఘ నేతపై ఫిర్యాదు చేయడం గమనార్హం. చివరికి ‘పిల్లల’ భవిష్యత్తుతోనూ ‘రాజకీయ’ క్రీడ సాగుతోందని టీఎన్జీవో నేత ఏలూరి శ్రీనివాసరావు గత డిసెంబర్ నెలలో జరిగిన పరిణామాల సందర్భంగా వాపోయారు. పిల్లల వివాహ సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేసే స్థితికి రాజకీయ కుట్రలు దిగజారడం దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా పరిణామాల్లోనే ఏలూరి శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలవడం కూడా వివాదానికి దారి తీసింది. మొత్తంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అధికార పక్షంలో ‘అనధికార’ పక్షంలో పెరుగుతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతుండడం గమనార్హం.