రూ. 63.00 లక్షల భారీ చోరీ సొత్తు కేసును ఛేదించిన ఖమ్మం పోలీసులు
ప్రియుడితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భర్త జేబుకే కన్నం వేసిన ఓ భార్య ఉదంతాన్ని ఖమ్మం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త ఇంటినుంచే బంగారం, వెండి నగలను తస్కరించి నగదుగా మార్చేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రూ. 63.00 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఆద్యంతం ఆసక్తి కలిగించే ఈ భారీ చోరీ ఘటనను ఖమ్మం పోలీస్ కమిషన్ విష్ణు ఎస్. వారియర్ సోమవారం మీడియా సమావేశంలో వివరించారు. ఆయన కథనం ప్రకారం… కారేపల్లికి చెందిన వ్యాపారి శివప్రకాష్ దారక్ అర్చన దారక్ ను 2008లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కూడా. ఈ దంపతులకు సంసారంలో వచ్చిన మనస్ఫర్థల వల్ల గడచిన ఏడాది కాలంగా విడివిడిగా ఉంటున్నారు.
శివప్రకాష్ దారక్ తన వ్యాపారంలో భాగంగా స్థానిక ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని డబ్బులిస్తూ వ్యాపారం చేస్తుంటాడు. ఇదే దశలో భర్త శివ ప్రకాష్ దారక్ తో విభేదాల కారణంగా అతని భార్య అర్చన గుంటూరులోని తన తల్లిగారింట్లో ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ సందర్భంగా మాచర్ల మండలం గన్నవరానికి చెందిన బత్తుల వెంకట కృష్ణప్రసాద్ (27)తో అర్చన వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుని, కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే శివప్రకాష్ దారక్ తల్లి మరణించడంతో… ఇదే కారణంతో అతని భార్య అర్చన దారక్ కారేపల్లికి తిరిగి వచ్చింది. కానీ భర్తను వదిలి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడు వెంకట కృష్ణప్రసాద్ తో కలిసి జీవించాలని అర్చన నిర్ణయించుకుంది. ఈమేరకు పథకరచన చేసింది. తన భర్త ఇంటి నుంచి బంగారు, వెండి ఆభరణాలను తీసుకుని ప్రియునితో ఉడాయించాలనేది ఆయా పథకపు సారాంశం. తన పథకం అమలులో భాగంగా ప్రియుడైన వెంకట కృష్ణప్రసాద్ ను కారేపల్లికి పిలిపించింది. ఆమె పిలుపుతో వెంకట కృష్ణప్రసాద్ ఈనెల 3వ తేదీన కారేపల్లికి చేరుకుని రైల్వే స్టేషన్ లోనే బస చేశాడు. మరుసటి రోజు అంటే 4వ తేదీన ఉదయం 2 గంటల ప్రాంతంలో అర్చన తన భర్త ప్యాంట్ జేబు నుంచి లాకర్ తాళాలు తీసుకుని బంగారు, వెండి ఆభరణాలతోపాటు ల్యాప్ టాప్ వంటి వస్తువులు తీసుకుని ప్రియుడైన వెంకట కృష్ణప్రసాద్ ను పిలిపించుకుని అప్పగించింది. ఆయా ఆభరణాలను నగదుగా మార్చి సిద్ధంగా ఉంచాలని అర్చన ఆదేశించింది.
ఈ పథకం గురించి తెలియని వ్యాపారి శివ ప్రకాష్ దారక్ పోలీసులను ఆశ్రయించాడు. ఈనెల 4వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్ టాప్ ను దొంగిలించారని ఈనెల 5వ తేదీన కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే చోరీకి గురైన బంగారు ఆభరణాలు 1,330 గ్రాములుగా, వెండి ఆభరణాలు 2,330 గ్రాములుగా వివరిస్తూ ఈనెల 20వ తేదీన మరో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు టెక్నాలజీ సాయంతో కేసును ఛేదించినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ చెప్పారు. అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీసీఎస్ ఏసీపీ జహంగీర్ ల ఆధ్వర్యంలో కారేపల్లి, సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేశారన్నారు. సాంకేతిక, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సాక్ష్యాలను సేకరించి నిందితులైన అర్చన దారక్, బత్తుల వెంకట కృష్ణప్రసాద్ లను అరెస్ట్ చేశామన్నారు నిందితుల నుంచి రూ. 63.00 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కాగా కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐలు నవీన్, శ్రీనివాస్, కారేపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్ లనేగాక ఇతర పోలీస్ సిబ్బందిని సీపీ విష్ణు ఎస్. వారియర్ ప్రశంసించారు.
ఫొటో: రికవరీ చేసిన చోరీ సొత్తు ఆభరణాలను పరిశీలిస్తున్న ఖమ్మం సీపీ విష్ణు ఎస్. వారియర్