ఖమ్మం జిల్లా సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసే దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించే సరిహద్దు మార్గాల్లో అనుమతి లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు.కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇందులో భాగంగానే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ సరిహద్ధుల్లోని బోనకల్ మండలంలోని చెక్ పోస్టును శనివారం సాయంత్రం సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అత్యవసర వైద్య సేవలకు, నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను మినహా మరే ఇతర ట్రాన్స్ పోర్టును అనుమతించవద్దన్నారు. వైరా, కొణిజర్ల చెక్ పోస్టులను కూడా సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించి స్థానిక అధికారులకు సూచనలు చేశారు. సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లోని చెక్ పోస్టు సిబ్బందికి కూాడా ఈ అంశంలో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ‘సూర్యాపేట-టు-ఖమ్మం… కరోనా వినూత్న జర్నీ?!’ శీర్షికన ts29 వార్తా కథనం ప్రచురించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించడం గమనార్హం.
ఇదీ చదవండి: సూర్యాపేట-టు-ఖమ్మం… కరోనా వినూత్న జర్నీ?!
వివిధ చెక్ పోస్టులను సీపీ సందర్శించి సూచనలు, సలహాలు ఇస్తున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.