ఖమ్మం నగరంలో 13 ఏళ్ల బాలికపై దురాగతానికి పాల్పడిన ఘటనలో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘోర ఘటనపై ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సీరియస్ అయ్యారు. పోలీస్ పీఆర్వో, స్పెషల్ బ్రాంచ్ నిఘా సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారంతో కేసును సుమోటోగా కమిషనర్ స్వీకరించడం విశేషం. ఘటనపై విచారణ జరపాల్సిందిగా అదనపు డీసీపీ ఇంజరాపు పూజను సీపీ ఆదేశించారు. ఈ పరిణామాల్లోనే పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. అతనిపై అత్యాచారయత్నం, పోక్సో యాక్ట్, బెదిరింపు వంటి అభియోగాల కింద ఐపీసీ 376 రెడ్ విత్ 511, 307, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ కథనం ప్రకారం ఘటన పూర్వాపరాల్లోకి వెడితే… నగరంలోని పార్శిబందంలో ఓ ఇంట్లో పనిచేస్తున్న బాలికపై యజమాని కుమారుడు బాలికను ప్రలోభపెట్టి
అత్యాచారయత్నం చేశారు. ఇందుకు బాలిక ప్రతిఘటిచటంతో పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసు పీఆర్వో, స్పెషల్ బ్రాంచ్ నిఘా విభాగానికి అందించిన విశ్వసనీయ సమాచారంతో కేసును సుమోటో స్వీకరించారు. స్వయంగా విచారణ జరిపేందుకు అడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజను బాధితురాలు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు పంపించారు. ఇదే దశలో మరోవైపు నిందుతుని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకున్నారు.
బాలిక మరణ వాంగ్మూలం రికార్డు చేసేందుకు జడ్జిని అభ్యర్థించారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం డీఎంహెచ్వో మాలతిని జిల్లా కలెక్టర్ పంపించారని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. అత్యాచారయత్నం, హత్యయాత్నానికి గురై ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పరామర్శించారు. బాధితురాలు, తల్లిదండ్రులతో ఆయన స్వయంగా మాట్లాడారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు కమిషనర్ వెంట టౌన్ ఏసీపీ అంజనేయులు, సీఐలు చిట్టిబాబు , తుమ్మ గోపి, వెంకన్నబాబు ఉన్నారు.