రిసెప్షన్ మెయిన్ డయాస్ విస్తీర్ణం ఎకరం. దాదాపు రెండు లక్షల మందికి భోజన ఏర్పాట్లు. ఇందుకోసం 12 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు. వేడుకకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ కోసం 25 ఎకరాల వైశాల్యంలో ఏర్పాట్లు. వీఐపీల భోజనాల కోసం ప్రత్యేకంగా మూడు ఎకరాల్లో సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లు. ‘ఆకాశమంత పందిరి…భూదేవి అంత అరుగు’ అంటే ఇదే కాబోలు. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు ‘పొంగులేటి’ శ్రీనివాసరెడ్డి ఇంట పెళ్లి వేడుకలో ఇది మరో విశేషం.
తన ఏకైక కుమారుడు హర్షరెడ్డి వివాహానంతరం ఖమ్మంలో ఆదివారం ‘పొంగులేటి’ ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు భారీ ఎత్తున వీఐపీలు, పార్టీ కేడర్, అభిమానులు రానున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పర్యటనకు వస్తున్నారు. ఇదే సందర్భంగా ‘పొంగులేటి’ కుమారుని రిసెప్షన్ వేడుకకు కూడా కేటీఆర్ హాజరు కానున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కేటీఆర్ తోపాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా హాజరు కానున్నారు. అంతేగాక తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల వంటి వీఐపీలు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా రిసెప్షన్ జరిగే ఎస్ఆర్ గార్డెన్స్ కు వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం గమనార్హం. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం-భద్రాచలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను సీపీ తఫ్సీర్ ఆదేశించారు. రిసెప్షన్ జరిగే ఎస్ఆర్ గార్డెన్స్ లో చేసిన ఏర్పాట్లు, పోలీసు అధికారుల బందోబస్తు పర్యవేక్షణ దృశ్యాలను దిగువన స్లైడ్ షోలో చూడవచ్చు.