- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవండి.
- కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ లేఖ
- నామ లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖమ్మం ఎంపీ, లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి విజృంభణతో, విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయ కుటుంబాల పట్ల కేంద్ర ప్రభుత్వం మానవీయంగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇటీవల ఆయన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కి లేఖ రాయగా సానుకూలంగా స్పందన లభించింది.
నియమ నిబంధనలతో అర్హులైన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకోవాలని గుర్తు చేశారు. అందులో భాగంగా ఖమ్మం నగరానికి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సత్వరమే జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ (జెడబ్ల్యుఎస్) కింద ఆర్ధిక సాయం మంజూరు చేసి, వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు తన లేఖలో ఉద్ఘాటించారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్ లో నివాసం ఉంటున్న కాశం వెంకన్న సలే దిన పత్రికల్లో జర్నలిస్ట్ గా పని చేశారు. అయితే ఆయన కోవిడ్ తో మృతి చెందారు. తన భర్త కోవిడ్ తో మృతి చెందడం వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, జర్నలిస్ట్ సంక్షేమ పథకం కింద ఆర్ధిక సాయం చేసి, ఆదుకోవాలని వెంకన్న భార్య సుశీల దరఖాస్తు చేసుకున్నారు.
అలాగే ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంకు చెందిన మరో సీనియర్ జర్నలిస్ట్ బైరి కరంచంద్ గాంధీ కూడా మృతి చెందారు. ఆయన భార్య కూడా తనకు ఆర్ధిక సాయం అందజేసి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇరు కుటుంబాల వారు నామను కలిసి, తమ పరిస్థితిని వివరించారు. సంబంధిత జర్నలిస్టుల విషయమై కేంద్ర మంత్రి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ నామ కోరిన తర్వాత నేడు కేంద్ర మంత్రి పరిశీలించి త్వరితగతిన మంజూరు చేస్తామని ఎంపీ నామకు లేఖ రాశారు.