ఖమ్మంలో చోటు చేసుకున్న అమానుష ఘటనలో తుదిశ్వాస విడిచిన 13 ఏళ్ల మైనర్ బాలిక మోతె నర్సమ్మ ఘటనలో న్యాయం జరుగుతుందా? మృతురాలి ఆత్మ శాంతించే విధంగా చట్టం నిందితున్ని దోషిగా నిర్ధారించి కఠినంగా శిక్షిస్తుందా? ఇవీ తాజాగా పలువురిలో కలుగుతున్న సందేహాలు. ఈ విషయంలో న్యాయకోవిదులు ఏమంటున్నారు? అసలు ఈ ఘటనలో తీర్పునాటికి జరిగే పరిణామాలు ఏమిటి? వంటి విషయాలు తెలుసుకునే ముందు ఘటన పూర్వాపరాలను పరిశీలిద్దాం.
పోలీసుల కథనం ప్రకారం… ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడు, వాదోడుగా ఉండేందుకు ఖమ్మం నగరంలోని పార్శీబంధానికి చెందిన అల్లం సుబ్బారావు ఇంట్లో పని మనిషిగా చేరింది. బాలికపై కన్నేసిన సుబ్బారావు కుమారుడు అల్లం మారయ్య ఆమెను బలాత్కరించేందుకు ప్రయత్నించాడు. ఇందుకు బాలిక ప్రతిఘటించింది. దీంతో ఆమెను చంపాలనే ఉద్ధేశంతోనే మారయ్య బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
గత నెల 19వ తేదీన జరిగిన ఈ ఘటనలో 70 శాతానికి పైగా కాలిన బాలికను ఖమ్మంలోని పూజ ఆసుపత్రిలో చేర్పించి రహస్య చికిత్స చేయించారు. అయితే ఈనెల 5వ తేదీన ఘటన వెలుగు చూడడం, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తీవ్రంగా స్పందించి అత్యంత వేగంగా చర్యలు తీసుకున్నారు. నిందితుడైన అల్లం మారయ్యను అదుపులోకి తీసుకుని అతనిపై ఐపీసీ 376 రెడ్ విత్ 511, 307, 354, 506 సెక్షన్ 10 పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు ఈనెల 6వ తేదీన మారయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ నేపథ్యంలోనే బాధితురాలిని హైదరాబాద్ తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూనే బాలిక నర్సమ్మ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఈ ఘోర ఘటనకు కారణమైన నిందితుడు మారయ్యను కఠినంగా శిక్షించాలని పలు రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ అమానుష ఉదంతంలో నిందితునికి కఠిన శిక్ష పడుతుందా? లేక కేసు తీర్పునాటికి ఏవేని ‘రాజీ’ పరిణామాలు చోటు చేసుకుంటాయా? అనే సందేహాలు కూడా భిన్నవర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
కానీ బాధిత బాలిక చనిపోవడమే నిందితుని పాలిట శరాఘాతంగా న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. చికిత్సతో బాలిక బతికితే కేసు తీర్పునాటికి ఏవేని రాజీ మార్గాలు చోటు చేసుకోవచ్చని అనుమానించవచ్చని, కానీ ప్రస్తుతం అటువంటి ప్రయత్నాలేవీ ఫలించవంటున్నారు. ‘ఎవరైనా చనిపోయే ముందు వారి నాలుకపై నిజం నడయాడుతుందని, జీవితాన్ని చాలిస్తున్నామని తెలిసీ ఎవరూ పగ సాధించరు’ అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో ఉటంకించిందని న్యాయకోవిదులు గుర్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రామాణికంగా ఖమ్మం న్యాయస్థానాల్లోనూ అనేక ఇటువంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడ్డాయంటున్నారు.
బాధిత బాలిక నర్సమ్మ మరణ వాంగ్మూలాన్ని స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ జస్టిస్ ఉషశ్రీ స్వయంగా నమోదు చేయడం గమనార్హం. ఈనెల 5వ తేదీన జస్టిస్ ఉషశ్రీ స్వయంగా పూజ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పునాటికి సాక్ష్యాలు ఉన్నా, లేకున్నా నిందితుడు మారయ్యకు కఠిన శిక్ష పడడం ఖాయమని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులోని సాక్షులు తీర్పునాటికి ప్రాసిక్యూషన్ వాదనకు ఎదురుతిరిగినా, నిందితునికి జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష పడే అవకాశాలు తప్పక ఉన్నాయంటున్నారు.
ఫొటో: బాధిత బాలికతో ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఈనెల 5వ తేదీన మాట్లాడినప్పటి చిత్రం (ఫైల్ ఫొటో)