ఖమ్మం నగరంలో దారుణ అఘాయిత్యానికి గురైన 13 ఏళ్ల మైనర్ బాలికను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రికి తరలించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల విజ్ణప్తి మేరకు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. ఖర్చుకు వెనుకంజ వేయకుండా చికిత్స అందించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని అధికారయంత్రాంగానికి ఆమె సూచించారు. మంత్రి ఆదేశాలతో బాలిక కేసును అత్యంత ప్రత్యేకంగా భావించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ శ్రీమతి దివ్య స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో గల బాలికను రెయిన్ బో హాస్పిటల్ కు తరలించి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి వైద్యం చేయిస్తున్నారు. మరోవైపు బాలిక ఆరోగ్య పరిస్థితిని మంత్రి సత్యవతి రాథోడ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు జిల్లా పోలీసు, వైద్య అధికారులతోనూ మాట్లాడి వెంటనే ఈ కేసుకు సంబంధించిన నిందితులకు కఠిన శిక్ష పడేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో మహిళల, శిశువుల సంక్షేమానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా మహిళలపై దాడులు జరిగితే నిందితులు ఎంతటివారైనా వదలొద్దు అని స్వయంగా సీఎం కేసిఆర్ చెప్పారని ఆమె పేర్కొన్నారు.