ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి వివాహ రిసెప్షన్ సందర్భంగా జనాభిమానం వెల్లువెత్తింది. జిల్లా నలు మూలల నుంచి హాజరైన అశేష జనం కారణంగా ఖమ్మం శివార్లన్నీ ఆదివారం కిటకిటలాడాయి. ఖమ్మం-భద్రాచలం-రాజమండ్రి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖమ్మం నడిబొడ్డు మయూరి సెంటర్ నుంచి రిసెప్షన్ ఏర్పాటు చేసిన ఎస్ఆర్ గార్డెన్స్ వరకు గల సుమారు ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు రెండు గంటలు పట్టిందంటే జన ప్రవాహం తీరును అవగతం చేసుకోవచ్చు. అంబులెన్సులకు కూడా దారి లభించని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఖమ్మం-భద్రాచలం మార్గంలో ట్రాఫిక్ జామ్ దృశ్యం

ఉదయం పదిన్నర గంటలకే భోజనాలు ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు కూడా రద్దీ తగ్గకపోగా, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండడం విశేషం. వచ్చీ పోయే వాహనాలకు దారీ తెన్నూ తెలియని రీతిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు కూడా నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. అనేక మంది వాహనదారులు పుట్టకోట, చింతకాని, వెంకటాయపాలెం తదితర ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా తమ వాహనాలను మళ్లించడం గమనార్హం. తన ఏకైక కుమారుడు హర్షరెడ్డి వివాహ రిసెప్షన్ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం, జిల్లా నలుమూలలా ఆహ్వానాలు అందడంతో జనం పెద్ద సంఖ్యలో పోటెత్తారు. సాయంత్రం ఆరు గంటల వరకు రిసెప్షన్ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్ చిక్కుకున్న దృశ్యం

Comments are closed.

Exit mobile version