ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఖమ్మం నగరంలోని చైతన్యనగర్ అలుగు వాగు కాలువ ఇది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గతంలో 170 అడుగుల విస్తీర్ణంలో గల ఈ కాలువ విస్తీర్ణం ప్రస్తుతం 30 అడుగులు మాత్రమేనని అధికారుల పరిశీలనలో తేలింది. మిగతా 140 అడుగుల కాలువ ఏమైందనే ప్రశ్నకు సమాధానంగా ఇదే చిత్రంలో కనిపిస్తున్న భవనాలను ఓసారి మళ్లీ పరిశీలించండి. తెల్లరంగులో కనిపిస్తున్న రెండు భవనాల్లో ఓ భవనానమే ఇప్పుడు ఖమ్మం నగర ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. కాలువనే కాదు, పక్కనే గల రోడ్డును సైతం కబ్జా చేసి దీన్ని అక్రమంగా నిర్మించారనే అంశంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదే ప్రాంతంలో కాలువను ఆనుకుని ప్రస్తుతం నిర్మిస్తున్న అనేక భవనాలు కూడా అక్రమ కట్టడాలేననే ఆరోపణలు వస్తున్నాయి.
కబ్జాలు, ఆక్రమణలు ఈ రోజుల్లో సహజమే కదా అని మాత్రం భావించాల్సిన అవసరం లేదు. కాలువను, రోడ్డును ఆక్రమించి కార్పొరేట్ స్కూల్ యజమాని నిర్మించిన ఐదంతస్తుల భవనం వందలాది కుటుంబాలను నిండా ముంచిందనే ఆరోపణలు వచ్చాయి. అలుగువాగు కాలువ కబ్జాకు గురి కావడం వల్లే గత నెల 31వ తేదీన వచ్చిన వరదలు చైతన్య నగర్, కవిరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లోని నివాసాలను నిండా ముంచాయనేది ప్రధాన ఆరోపణ. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆయా ప్రాంతాలు వరద నీటిలో మునగడానికి ప్రయివేట్ స్కూల్ యజమాని కబ్జా దాహమే కారణమని ప్రజలు చెబుతున్నారు. అనధికార సమాచారం ప్రకారం ఈ కబ్జా వల్లే దాదాపు 1,100 పైచిలుకు నివాసాలు వరద ముంపునకు గురయ్యాయి. అంటే దాదాపు రెండున్నర వేల మంది ప్రజలు స్కూలు యజమాని కబ్జాకు బలైనట్లు విమర్శలుున్నాయి.
అయితే ఇప్పుడీ అక్రమ భవనాన్ని కూల్చే విషయంలో అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నాగార్జున ఫంక్షన్ హాల్ పక్కనే గల ఐస్ ఫ్యాక్టరీ విషయంలో తీసుకున్న చర్యను మున్సిపల్ అధికారులు ఈ భవనంపై ఎందుకు తీసుకోవడం లేదని కవిరాజ్ నగర్, చైతన్యనగ్ ప్రాంతాల వరద బాధిత వర్గాలు నిలదీస్తున్నాయి. మాయమైన బతుకమ్మ కుంట, కబ్జాకు గురైన అలుగువాగు కాలువకు పూర్వ స్థితి తీసుకురాకుంటే కవిరాజ్ నగర్, చైతన్య నగర్ తదితర ప్రాంతాలు ఏటా వర్షాలకు ముంపునకు గురయ్యే ప్రమాదాన్ని ఎవరూ తోసిపుచ్చలేకపోతున్నారు. అక్రమ నిర్మాణంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రయివేట్ స్కూల్ బిల్డింగ్ విషయంలో ఏం జరుగుతోందన్నదే తాజా ప్రశ్న. ఈ నేపథ్యంలో సరిగ్గా పది నెలల క్రితం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఓ ముఖ్యాంశాన్ని మననం చేసుకుంటే…
గత ఎన్నికల సమయంలో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మంలోని కబ్జాలనే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. కబ్జాలు లేని ప్రశాంత ఖమ్మం నగర జీవనం కోసం తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఇటువంటి కబ్జాలనేకాదు, ఇంకా అనేక ప్రజావ్యతిరేక చర్యలకు ఫలితమే ఖమ్మం నియోజకవర్గ ప్రజల తీర్పు. రికార్డు స్థాయి మెజారిటీతో ఖమ్మం నగర ప్రజలు తుమ్మలను గెలిపించారు. కబ్జాలు లేని ఖమ్మం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు కూడా గత డిసెంబర్ 15వ తేదీన తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఖమ్మం నగర కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేవంలో తుమ్మల మాట్లాడుతూ, కబ్జాలు లేని ఖమ్మం నగరాన్ని చూపిస్తానని, ఖమ్మం ప్రజలు రికార్డు స్థాయి మెజారిటీని ఇవ్వడం తన బాధ్యతను మరింత పెంచిందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కవిరాజ్ నగర్, చైతన్య నగర్ ప్రాంతాల వరద బాధితులు మంత్రి తుమ్మలకు ఇదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఈ విషయంలో తుమ్మల వ్యక్తిత్వాన్ని శంకించాల్సిన అవసరమే లేదు. భాషాపరమైన నోటి దురద మినహా అవినీతి మచ్చలేని నాయకుడిగా తుమ్మల పేరు తెచ్చుకున్నారు. దశాబ్ధాల తన రాజకీయ జీవితంలో తుమ్మల అవినీతిపరుడంటూ ఆరోపణ చేసిన ప్రత్యర్థి పార్టీల నేతలు ఒక్కరంటే ఒక్కరు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ ఖమ్మంలో బలమైన శక్తులుగా పేరు తెచ్చుకున్న ప్రయివేట్ స్కూళ్ల యజమానులు కొందరు తాజాగా వేస్తున్న అడుగులు అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. కాలువను కబ్జా చేసి బిల్డింగ్ కట్టినట్లు ఆరోపణలు గల కార్పొరేట్ స్కూల్ ఓనర్ ను రక్షించేందుకు విఫలయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా అతన్ని వెంటేసుకుని మంత్రి తుమ్మలను కలిసి లంచ్ లేదా డిన్నర్ కు ఆఫర్ చేసిన ప్రయివేట్ స్కూళ్ల యజమానుల కదలికలపై వరద బాధితులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకోరు ఆరోపణలు ఎదుర్కుంటున్న కార్పొరేట్ స్కూల్ యజమాని ముఖం చూసేందుకే తుమ్మల నిరాకరించినట్లు వార్తలు వచ్చిన పరిణామాల్లో, మరికొందరు ప్రయివేట్ స్కూళ్ల ఓనర్లు అతన్ని వెంటేసుకుని తుమ్మలను కలవడంపై వరద బాధితుల నుంచి సహజమైన వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
దీంతో జిల్లాలో బలమైన సామాజిక వర్గం, ప్రయివేట్ స్కూళ్ల యజమానుల ఒత్తిడికి తుమ్మల నాగేశ్వర్ రావు తలొగ్గే అవకాశాలున్నాయా? అనే సందేహాలను వరద బాధిత ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తాను నమ్మిన అంశానికి, ప్రజా ప్రయోజనాన్ని పరిరక్షించే విషయంలో తుమ్మల వ్యవహార శైలిపై అతని గురించి తెలిసినవారికి ఏ సందేహం లేకపోయినా, తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం భిన్నవాదనలకు తావు కల్పిస్తున్నాయి. మొన్న తనను కలిసిన ప్రయివేట్ స్కూళ్ల యజమానులకు కూడా కబ్జా అంశంలో తుమ్మల తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగానే స్పష్టం చేశారు. సర్వే జరుగుతోందని, నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామాల్లోనే జనమా? కబ్జా ఆరోపణలు గల కార్పొరేట్ స్కూల్ భవనమా!? తేల్చుకోవలసింది అధికారులు, పాలకులు మాత్రమే.. అనే చర్చ జరుగుతోంది.