కరోనా కేసుల నమోదులో ఖమ్మం జిల్లా నిన్న గ్రేటర్ హైదరాబాద్ ను మించిపోయింది. తెలంగాణా వ్యాప్తంగా నిన్న (25వ తేదీ) 3,018 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ద్వారా వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న అత్యధికంగా 475 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఈ బులిటెన్ లో పేర్కొంది.
అయితే ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజే 551 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకున్నపుడు పాజిటివ్ కేసుల్లో ఖమ్మం జిల్లాలో నిన్న 5.4 వంతుగా కరోనా రికార్డు కావడం గమనార్హం.
గడచిన నాలుగైదు రోజులుగా ఖమ్మం జిల్లాలో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తేదీల వారీగా పరిశీలిస్తే… ఈనెల 21న 385 మంది, 22న 296 మంది, 23న 232 మంది, 24న 528 మంది చొప్పున కరోనా బారిన పడ్డారు. ఆయా సంఖ్యను అధిగమించి మంగళవారం రికార్డు స్థాయిలో 551 మందికి కరోనా పాజిటివ్ గా టెస్టుల్లో తేలింది.
టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతున్నాయని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ రెండు వేలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి. మాలతి మీడియాకు వెల్లడించారు.