రాజకీయ పార్టీ నిర్వహణ అంటే సాధారణ విషయమేమీ కాదు. తెలంగాణా సీఎం కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే ‘పార్టీ నిర్వహణ అంటే పాన్ డబ్బా నడిపినంత ఈజీ కాదు’. పార్టీ అన్నాక బోలెడు ఖర్చులు ఉంటాయి. ఇక వామపక్ష పార్టీలకైతే ఫుల్ టైమ్ కార్యకర్తలు కూడా ఉంటారు. ప్రతి నెల ఈ ఫుల్ టైమ్ వర్కర్లకు నెలవారీ ఖర్చులకు పార్టీయే డబ్బు సమకూర్చాల్సి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వీరికి గౌరవ వేతనం చెల్లించాలన్న మాట. కమ్యూనిస్టు పార్టీల్లో ఈ తరహా ఖర్చులు అనేకం ఉంటాయి.
ఇక అసలు విషయానికి వస్తే గడచిన రెండేళ్లుగా ఖమ్మం జిల్లా సీపీఐ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కుంటున్నదట. కరోనా మహమ్మారి సృష్టించిన పరిణామాల కారణంగా విరాళాల వైపు కూడా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధుల కొరతను అధిగమించడానికి, పార్టీ నిర్వహణకు అవసరమైన ఆదాయ వనరుల పెంపుపై సీపీఐ జిల్లా కమిటీ దృష్టిని కేంద్రీకరించింది.
ఇందులో భాగంగానే ఖమ్మం బైపాస్ రోడ్డులోని సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకుంది. సూర్యాపేట-రాజమండ్రి మార్గంలో ఖమ్మం నగరాన్ని చీల్చుకుంటూ వెళ్లిన జాతీయ రహదారిని అనుకుని ఉన్న సీపీఐ ఆఫీసు ముందు ఈ షాపింగ్ కాంప్లెక్సును నిర్మిస్తున్నారు. మొత్తం 10 మడిగెలు (షట్టర్లు) 10X20 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సీపీఐ వర్గాలు చెప్పాయి.
పార్టీ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులకు తాజాగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ఉపకరిస్తుందని సీపీఐ కేడర్ చెబుతోంది. ముఖ్యంగా ఫుల్ టైమర్లకే నెలసరి దాదాపు రూ. 2.00 లక్షలు చెల్లించాల్సి వస్తోందని, ప్రస్తుతం నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ మడిగెల అద్దెల ద్వారా లభించే ఆదాయంతో పార్టీ నిధుల కొరతను అధిగమిస్తుందనే ఆశాభావాన్ని ఆ పార్టీ కేడర్ వ్యక్తం చేస్తోంది. పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం నాయకులు తీసుకుంటున్న తాజా నిర్ణయాలపై సీపీఐ కేడర్ హర్షం వ్యక్తం చేస్తోంది.