ఫొటో చూశారు కదా? ఓ మహిళా పోలీసు బండి (ద్విచక్ర వాహనం) నడుపుతోంది. మరో ఇద్దరు ఆమె వెనకాల కూర్చున్నారు. బండి నడుపుతున్న కానిస్టేబుల్ చెవిలో మధ్యలో కూర్చున్న మరో కానిస్టేబుల్ సెల్ ఫోన్ ఉంచి సహాయం చేస్తుండగా, ఆమె మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తోంది. వెనకాల కూర్చున్న మరో కానిస్టేబుల్ కూడా ఎంచక్కా మొబైల్ లోనే మాట్లాడుతోంది. వాహనం నడుపుతున్న కానిస్టేబుల్ కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు. ఎక్కడిదీ దృశ్యం అనుకుంటున్నారా? ఖమ్మం నగరంలో కనిపించిన ఈ ఫొటోపై ఇటీవలే బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ సీరియస్ అయ్యారు. ఇంకేముంది ముగ్గురు కానిస్టేబుళ్లపై డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీకి కూడా సీపీ ఆదేశించారు. అంతేకాదు హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర మలుపులో నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి ఉల్లంఘనల కింద రూ. 3,300 జరిమానా కూడా విధించారు.
సామాన్యుడు ఎవరైనా ఇలా బండి నడిపితే ఛటుక్కున ఫొటో తీసి చలానా విధించే పోలీసు శాఖలోనే ఈ ముగ్గురు మహిళా పోలీసులు ఇలా ప్రయాణించడంపై సీపీ విష్ణు వెంటనే స్పందించారు. ఇంతకీ ఈ ముగ్గురు మహిళా పోలీసులు ఎందుకిలా ప్రయాణించారో తెలుసా? ఈనెల 9వ తేదీన వైఎస్ షర్మిల సభకు హాజరయ్యేందుకు, అక్కడ విధులు నిర్వహించేందుకు ఇలా ప్రయాణించారన్నమాట. నగరంలోని ఆనంద్ విహార్ వద్ద గల సీసీ కెమెరాలో ఈ దృశ్యం నిక్షిప్తమైంది. ఫలితంగానే సిటీ ఆర్ముడ్ విభాగానికి చెందిన ఆయా ముగ్గురు మహిళా పోలీసుల ప్రయాణపు తీరుపై సీపీ ఆగ్రహించారు. జరిమానాతోపాటు శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.