వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత కార్పొరేటర్ల పరిస్థితి ఏమిటి? వారి పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇదీ ఖమ్మం నగర పాలక సంస్థలో తాజా విశేషం. ‘ప్రజాభిప్రాయ సేకరణ’ పేరుతో నిర్వహించినట్లు పేర్కొంటున్న 62 పేజీల సర్వే డాక్యుమెంట్ ఒకటి లీక్ కావడం విశేషం. ఈనెల 3వ తేదీ వరకు గల పరిస్థితిని వివరిస్తూ ఊరూ, పేరూ లేని సర్వే నివేదిక లీక్ కావడం గమనార్హం. మొత్తం 62 పేజీలతో గల ఈ సర్వేలో ప్రస్తుత కార్పొరేటర్ల పనితీరు ప్రధాన ప్రామాణికంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
లీకైన ఆయా సర్వే నివేదిక ప్రకారం… గత నెల 28వ తేదీ నుంచి ఈనెల 3 వ తేదీ వరకు ఖమ్మం నగర పాలక సంస్థలోని 50 డివిజన్లలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పరిపాలన, కార్పొరేటర్లు, రాజకీయ పార్టీలు ప్రధానాంశాలుగా ఎంచుకుని సర్వే జరిపారు. వ్యాపారులు, రైతులు, రైతు కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, గృహిణులు, కార్మికులు, ప్రయివేట్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగ వర్గాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. మూడే మూడు ప్రశ్నలను ప్రధానంగా ఎంచుకుని ఈ సర్వే నిర్వహించారు. నగరపాలక సంస్థ పనితీరు ఎలా ఉంది? మీ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది? ఏ పార్టీకి ఓటేస్తారు? అనే ప్రశ్నలను మాత్రమే ఎంచుకున్నారు. మొత్తం యాభై డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి సగటున 170-180 మంది చొప్పున 8,754 శాంపిళ్లను సర్వే ద్వారా సేకరించారు. నగరంలోని యాభై ప్రాంతాల్లో ఈ సర్వే ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఇక ఫలితాల విషయానికి వస్తే కార్పొరేషన్ పనితీరుకు 31.43 శాతం ‘గుడ్’, 44.75 మంది ‘యావరేజ్’, 23.82 శాతం ప్రజలు ‘పూర్’ మార్కులు వేశారు. అదేవిధంగా కార్పొరేటర్ల పనితీరుకు సంబంధించి 26.16 శాతం గుడ్, 42.05 శాతం యావరేజ్, 31.79 శాతం మంది పూర్ మార్కులు ఇచ్చారు. నగరంలోని మొత్తం డివిజన్లలో 11 డివిజన్లలో మాత్రమే కార్పొరేటర్ల పనితీరుకు ‘గుడ్’ మార్కులు వేశారు. మరో 25 డివిజన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల పనితీరుకు ‘యావరేజ్’ మార్కులు మాత్రమే పడ్డాయి. ఇక మిగిలిన 14 డివిజన్ల కార్పొరేటర్ల పనితీరుకు ప్రజలు ‘పూర్’ మార్కులు వేశారు.
యావరేజ్ మార్కులు పడిన 25 డివిజన్లలో 21 మంది, పూర్ మార్కులు పడిన 14 డివిజన్లలో 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఉండడం గమనార్హం. ‘పూర్’ మార్కులు పడిన 14 డివిజన్ల కార్పొరేటర్లలో 12 మందికి మరీ ‘బ్యాడ్’ ఇమేజ్ ఉన్నట్లు కూడా సర్వే నివేదికలో పేర్కొనడం గమనార్హం.
ఏ పార్టీకి ఓటు వేస్తారనే మూడో ప్రశ్నకు మాత్రం 51.33 శాతం టీఆర్ఎస్, 28.52 శాతం కాంగ్రెస్, 15.51 శాతం ఇతరులు, 4.63 శాతం బీజేపీ పార్టీలకు ప్రజాభిప్రాయసేకరణలో మార్కులు పడినట్లు నివేదించారు. మొత్తంగా గమనించాల్సిన అంశమేమిటంటే అసలు ఈ సర్వే నిర్వహించిన సంస్థ పేరేమిటి? సంస్థకు గల చరిత్ర ఏమిటి? దాని నిబద్ధత ఏమిటి? అనే అంశాలేవీ నివేదికలో ఎక్కడా లేకపోవడమే. ‘ఖమ్మం కార్పొరేషన్ పబ్లిక్ ఒపీనియన్’ పేరుతో 62 పేజీల నివేదికను రూపొందించి ప్రాచుర్యం కల్పిస్తుండడమే అసలు ప్రత్యేకత కాగా, ఈ సర్వే అంశాన్ని ప్రజలు విశేషంగా చర్చించుకుంటున్నారు.