రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేస్తున్న ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుంది? ఓ డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు గల ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సవాల్ గా పరిణమించిందా? ఎవరిని ఖరారు చేస్తే మరెవరైనా రాజకీయ పావులు కదుపుతారనే ఆందోళన పార్టీ పెద్దల్లో ఏర్పడిందా? ఇదే జరిగితే అంతిమంగా పార్టీ అభ్యర్థి గెలుపు పరిస్థితి ఏమిటి? ఇటువంటి అనేక ప్రశ్నలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తున్నాయనే చెప్పాలి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు.. ఎటునుంచి ఎటుగా లెక్కలు వేసినా చివరికి టికెట్ దక్కేదెవరికి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కేటాయింపు అంశాల్లో రాజకీయ పార్టీలు వేగాన్ని పెంచాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను చకచకా ప్రకటిస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ లో మాత్రం ఇంకా వడపోత ప్రక్రియ కొనసాగుతోంది. వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం సర్వేను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులనేగాక ఇతర ముఖ్య నేతలను హైదరాబాద్ పిలిపించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ అభిప్రాయ సేకరణ జరిపారు. పార్టీ తరపున అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని ఆరా తీశారు. స్థానిక నాయకుల అభిప్రాయాలతో కూడిన నివేదికను దీపాదాస్ మున్షీ గురువారం కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనున్నారు. ఈనెల 15వ తేదీన జరిగే సీఈసీ సమావేశంలో నివేదికల్లోని అంశాలను పరిశీలించి, చర్చించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే అభ్యర్థులను ప్రకటించని రాష్ట్రంలోని 13 సీట్లలో 12 స్థానాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఖరారు అంశం పార్టీ అధిష్టానానికి కత్తిమీద సాములా మారిందని పరిశీలకులు అంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కుమారుడు యుగంధర్ లు ఎంపీ టికెట్ ను ఆశిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు. ఇందులో ఎవరికి టికెట్ కేటాయిస్తే మిగిలిన ఇద్దరు అభ్యర్థుల కుటుంబాలకు చెందిన మంత్రుల వైఖరి ఎలా ఉంటుందనేదికి కీలకంగా మారిందంటున్నారు.
నిజానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడైన ప్రసాదరెడ్డికి దాదాపు టికెట్ ఖరారైన పరిస్థితులకు కొందరు ముఖ్యనేతలు అడ్డుపుల్ల వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు సఫలమవుతుందనే అంశంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాయింట్లవారీగా పరిశీలిస్తే ఏ రకంగా చూసినా టికెట్ ఎవరికి దక్కితే పార్టీ ప్రయోజనం నెరవేరుతుందో సులభంగానే బోధపడుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని అంశానికి వస్తే మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ కేటాయిస్తే ఆమె ఆశలకు గండిపడినట్లుగానే భావిస్తున్నారు. అదేవిధంగా మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కుమారుడు యుగంధర్ టికెట్ కోసం సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారా? లేక భవిష్యత్ రాజకీయాల కోసం ముందుచూపుతో వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లోనే తలెత్తుతున్నాయి. ఎందుకంటే తన కుమారుడి టికెట్ కోసం మంత్రి తుమ్మల సీరియస్ గా ప్రయత్నిస్తున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదంటున్నారు. ఇదే దశంలో యుగంధర్ ప్రయత్నాలకు తుమ్మల అడ్డుపడుతున్నట్లు కూడా కనిపించడం లేదు. ఈ విషయంలో మంత్రి తుమ్మల గుంభనంగా ఉండడం కూడా పార్టీలో చర్చకు దారి తీస్తోంది.
మరో కోణంలో సామాజికపరంగానూ పట్టుబడుతున్న జెట్టి కుసుమ కుమార్, వీవీసీ రాజేంద్రప్రసాద్, తుమ్మల యుగంధర్ ల టికెట్ ప్రయత్నాలపైనా భిన్న చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని సామాజిక పరిస్థితులను, పరిణామాలను బేరీజు వేసుకున్నపుడు తమకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఆయా ఆశావహులు అంచనా వేస్తన్నారట. కానీ ఈ సామాజిక అంశాన్ని పక్కకు తప్పించడానికే పార్టీ వ్యూహాత్మకంగా, ముందస్తుగానే రేణుకా చౌదరికి రాజ్యసభ సీటును కేటాయించిందంటున్నారు. అంతేగాక తుమ్మల నాగేశ్వర్ రావు కేబినెట్ మంత్రిగా ఉన్నారని, పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారనే ప్రస్తావన కూడా పార్టీలో వస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో సామాజికపరంగా ఆయా వర్గానికి జరిగిన నష్టం ఏమీ లేదనే వాదన కూడా తెరపైకి వస్తోంది.
ఇటువంటి వివిధ కోణాల్లో పరిశీలించినపుడు పొంగులేటి ప్రసాదరెడ్డికి టికెట్ ఖాయంగా కాంగ్రెస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు గెల్చిన పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైఎస్ఆర్ సీపీ ఎంపీగా విజయం సాధించిన ఉదంతాన్ని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడింట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా, మూడింటి డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల బలం ఉందనేది తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీపీఐ మిత్రపక్షంగా కొనసాగితే సీటు పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ పరిణామాల్లో ‘సామాజికం’ అనేది పెద్దగా పరిగణనలోకి తీసుకునే అంశమే కాదని పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది స్పష్టంగానే తెలుస్తోందంటున్నారు. రాజకీయంగా కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు.. ఎన్ని విధాలుగా లెక్కలు వేసినా పొంగులేటి ప్రసాదరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖాయంగా, ఖరారుగా కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ కేడర తోపాటు పొంగులేటి అభిమానులు కూడా ప్రసాదరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయినట్లుగా జిల్లాలో రాజకీయ వాతావరణం కనిపిస్తోంది.