ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయబోతున్నదా? లేక మధ్యేమార్గంగా మారొకరిని రంగంలోకి దించబోతున్నదా? ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు ఈ విషయంలో అసంతృప్తికి గురి కాకుండా పార్టీ అనుసరించే వైఖరేమిటి? ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇంకా నాన్చుడు ధోరణి అవలంభించడం వెనుక గల వ్యూహమేంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రాబోతున్నదా? తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే..
నిజానికి ఖమ్మంలో గెలుపు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సందేహాలు లేకపోవచ్చు. కానీ ఆ పార్టీకి కంచుకోటగా ప్రాచుర్యం పొందిన ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంపైనే భిన్న కథనాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అప్రతిహత విజయం తర్వాత ఖమ్మం ఎంపీ టికెట్ పై అనేక మంది నాయకుల్లో మరింత పట్టుదల పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ పై భారీ ఆశలు పెంచుకున్నారు. పార్టీలో చేరిక సమయంలోనే తన తమ్ముడు ప్రసాదరెడ్డికి టికెట్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షరతు విధించారనే కథనాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే నైతికత ప్రకారం ప్రసాదరెడ్డికే టికెట్ కేటాయించడం ధర్మమనే వాదన కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. అయితే అనూహ్యంగా డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని కూడా టికెట్ రేసులోకి దూసుకువచ్చారు. ఇదే సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయకుడు యుగంధర్ సైతం టికెట్ కోసం తనదారుల్లో తాను ప్రయత్నిస్తున్నారు. అంతేగాక వి. హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్, వీవీసీ రాజేంద్రప్రసాద్ తదితరులు కూడా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిణామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో 14 స్థానాలకు టికెట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన మూడు స్థానాలపై వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర అసహనాన్ని కలగిస్తోందనే చెప్పాలి. ముఖ్యంగా ఖమ్మం సీటుపై పడిన పీట ముడులను విప్పేందుకు పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్ ఖరారైందనే వార్తల నేపథ్యంలోనే ముఖ్యనాయకుడొకరు తనదైన ప్రాబల్యంతో అడ్డుపుల్ల వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు భట్టి భార్య నందిని టికెట్ రేసు నుంచి వైదొలగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల్లోనే వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురాంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
రఘురాంరెడ్డి పేరును తెరపైకి తీసుకురావడంలో మంత్రి పొంగులేటి వ్యతిరేకులు సఫలమయ్యారనే కథనాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం రఘురాంరెడ్డి ఎటువంటి దరఖాస్తు చేసుకోకపోయినా, ప్రస్తుతం టికెట్ రేసులో మిగతావారికన్నా ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఎటువంటి మచ్చలేని సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యున్ని తెరపైకి తీసుకురావడంలో పొంగులేటి వ్యతిరేకుల వ్యూహం ఏదైనప్పటికీ, రఘురాంరెడ్డివైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. అయితే అత్యంత సున్నిత మనస్తత్వం గల రఘురాంరెడ్డి పోటీకి అంగీకరిస్తారా? లేదా అనేది మరో ప్రశ్న. పాలేరు నుంచి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడగా రఘురాంరెడ్డి సున్నితంగా టికెట్ ను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజకీయంగా మంత్రి పొంగులేటి కుటుంబ ప్రాబల్యాన్ని నిలువరించేందుకు పార్టీకి చెందిన కొందరు నాయకులే ఈ విషయంలో చాకచక్యంగా పావులు కదిపారంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి, వియ్యంకుడు రఘురాంరెడ్డి మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఇంచార్జిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్ దక్కుతుందా? లేక వియ్యంకుడిని పార్టీ రంగంలోకి దించుతుందా? ఏదేని అనూహ్య పరిణామాల్లో ఇద్దరినీ కాకుండా మరో అభ్యర్థి వైపు పార్టీ మొగ్గు చూపుతుందా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మొత్తంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో ఈరోజు స్పష్టత వస్తుందని విశ్వసనీయ సమాచారం. ఖమ్మం నుంచి తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ శనివారం ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.