వరంగల్ మహానగర అభివృద్ధికి పలు పథకాల కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్ మహా నగరంలో పర్యటించారు. ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు. భద్రకాళి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల పురోగతిని పరిశీలించారు. హృదయ్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న హన్మకొండలోని బుగ్గలోనిగుట్టలోగల చారిత్రక జైన్ హెరిటేజ్ ప్రాంతాన్ని కూడా కేంద్ర మంత్రి సందర్శించారు. అనంతరం హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, రైల్వే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో నగరంలోని
వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించి రైల్వేకు సంబంధించి ముఖ్యంగా కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రగతిపై కిషన్ రెడ్డి సమీక్షించారు. రూ. 385 కోట్ల వ్యయంతో కాజీపేటలో ఏర్పాటు చేసే రైల్వే కోచ్ ఓవర్ హాలింగ్ పరిశ్రమకు అవసరమయ్యే 160 ఎకరాల భూసేకరణ చేసి, రూ. 143 కోట్లలో రూ. 133 కోట్ల మొత్తాన్ని చెల్లించామన్నారు. త్వరలో రైల్వే అధికారులకు భూమిని అప్పగిస్తామని కలెక్టర్ మంత్రికి వివరించారు. త్వరితగతిన భూమి అందిస్తే రైల్వే పరిశ్రమ ఏర్పాటు వల్ల నేరుగా వెయ్యి మందికి, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు రైల్వే కోచ్ ఓవర్ హాలింగ్ పరిశ్రమ ఏర్పాటు గురించి మ్యాప్ ల ద్వారా వివరించారు.

వరంగల్-హన్మకొండ, కాజీపేటలతో కూడిన ‘త్రినగరి’ అభివృద్ధికి స్మార్ట్ సిటీ, హృదయ్ పథకాల కింద నిధుల కేటాయింపు, ఖర్చు, పనుల పురోగతిని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రూ. 2,350 కోట్లతో 94 పనులు ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ. 196 కోట్లు మంజూరు చేసి, రూ. 138 కోట్లు విడుదల చేసిందన్నారు. అందులో రూ. 61 కోట్లతో 17 పనులు పూర్తయ్యాయని, రూ. 81 కోట్లతో కొనసాగుతున్న పనులు జనవరి చివరి నాటికి పుర్తవుతాయని, మిగిలిన పనులు వివిధ పురోగతి, టెండర్ ప్రక్రియ దశల్లో ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం తర్వాత పెద్దదైన వరంల్ నగరంలో చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడానికి హృదయ్ పథకం కింద మంజూరు చేసిన రూ. 35 కోట్ల పనులపై మంత్రి ఆరా తీయగా, రూ. 21 కోట్లతో భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు, వేయి స్తంభాల దేవాలయం అభివృద్ధి పనులను రూ. 98 లక్షలతో, కాజీపేట దర్గా అభివృద్ధి పనులను రూ. 73 లక్షలతో, పద్మాక్షి దేవాలయం పునరుద్ధరణ పనులు, జైన్ దేవాలయ అభివృద్ధి పనులు, రూ. 8.97 కోట్ల రూపాయల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కమిషనర్ వివరించగా, ఆయా పనులు నిర్దేశిత వ్యవధిలోగా పుర్తి చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. అదేవిధంగా నగర సుందరీకరణ అభివృద్ధి పనుల్లో నాణ్యతగా, వేగవంతంగా జరిగేలా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్లు తగిన పర్యవేక్షణ నిర్వహించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ సమీక్షా సమావేశాల్లో రైల్వే అధికారులు మన్యం రూపేష్, మిశ్రా, పీకే సజ్జ, శ్వేతా పవర్, బల్దియా ఎస్ ఈ విద్యాసాగర్, స్మార్ట్ సిటీ పీఎం ఆనంద్ వోలెటి తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version