కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చారిత్రక ఓరుగల్లు మహానగరంలో శుక్రవారం పర్యటించారు. అంతకు ముందు జనగామలో మీడియాతో మాట్లాడారు. వరంగల్ లో భద్రకాళి అమ్మవారికి మొక్కు చెల్లించుకుని ఆ మహాతల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వరంగల్ మహానగరంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత దివంగత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి నకిరేకల్ కు పయనమయ్యారు. ఇంతేనా… కిషన్ రెడ్డి పర్యటన విశేషాలు? ఇవి కాదు… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వరంగల్ పర్యటనలో అసలు కథ వేరే ఉంది.

‘గ్రేటర్ వరంగల్’ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ నేతలు ముందే మేల్కొన్నట్లు కనిపిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణా బీజేపీ నేతలు మాంచి ‘జోష్’లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం టార్గెట్ వరంగల్, ఖమ్మం నగరాలే కాదు, నాగార్జునసాగర్ నియోజకవర్గం కూడా. ముందస్తు రాజకీయ వ్యూహంలో భాగంగానే బీజేపీ నేతల అడుగులు ఆయా నగరాలవైపు పడుతున్నాయ్. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిరిగానే అధికార పార్టీకి మరోసారి పొలిటికల్ షాక్ ఇచ్చేందుకు బీజేపీ ప్రణాళికలు, వ్యూహాలు సాగుతున్నాయ్. అందులో భాగమే కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వరంగల్ జిల్లాలో బీజేపీ రాజకీయంగా దశాబ్ధాలుగా పట్టును కలిగి ఉంది. అప్పటి జనసంఘ్ నుంచి ఇప్పటి బీజేపీ వరకు విజయాలు సాధించిన చారిత్రక నేపథ్యం ఉంది. గతంలో వరంగల్ మేయర్ పదవిని అధిష్టించిన నేపథ్యమూ ఉంది. శాయంపేట, పరకాల, హన్మకొండ, వర్ధన్నపేట వంటి స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందిన పొలిటికల్ ‘రికార్డులు’ ఉన్నాయి. గత వైభవాన్ని తిరిగి పొందడానికి ఇప్పుడు వరంగల్ నగరాన్ని బీజేపీ నేతలు టార్గెట్ గా ఎంచుకున్నారు. వరంగల్ పక్కనే గల ఖమ్మం నగరంలోనూ కాషాయ జెండాను ఎగురవేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. రాజకీయంగా ఖమ్మంలో బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలను, అంశాలను వేరే కథనంలో చెప్పుకుందాం. ఇప్పుడు వరంగల్ మహానగరంలో కిషన్ రెడ్డి పర్యటన పరోక్షంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంగానే భావించవచ్చు. త్వరలోనే జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల సన్నాహక ప్రచార పర్వంగానూ అంచనా వేయవచ్చు. కాకపోతే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో మాత్రమే వరంగల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏం చేశారనేది కూడా ఆసక్తికరమే.

వరంగల్ నగరంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించిన దృశ్యం

వరంగల్ నగరంలో అడుగిడి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నదే తడవుగా వరంగల్ నగరంలో అమలవుతున్న కేంద్ర పథకాలను ‘కెలికారు’. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆరేళ్ల క్రితం అనగా 2014లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ. 150 కోట్ల మొత్తపు వ్యయంతో కాకతీయ మెడికల్ కాలేజి (కేఎంసీ) ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ. 30 కోట్లలో రూ. 13 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఆసుపత్రి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీకి అవసరమైన 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ పథకాలను ప్రస్తావించారు, ఆయా పథకాల అమలు తీరుతెన్నులపై రైల్వే, ఇతర విభాగాల అధికారులతోనూ కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరంగల్ మహానగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలను కేటాయిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తాలను మంజూరు చేయడం లేదని ఆయన పదే పదే ప్రస్తావించారు.

అంతకు ముందు జనగామలో మీడియాతో మాట్లాడుతూ, దుబ్బాక, జీహెచ్ఎంసీల్లోనేకాదు, తెలంగాణా వ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని, కుటుంబ పాలన, అవినీతిపై తెలంగాణా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజల, తెలంగాణా ఉద్యమకారుల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన వరంగల్ పర్యటనలో వ్యాఖ్యానించారు. హన్మకొండ న్యూ శాయంపేటలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో మార్పుకోసం దుబ్బాక ప్రజలు తొలి అడుగు, జీహెచ్ఎంసీ ప్రజలు రెండో అడుగు వేశారని, మూడో అడుగు గ్రేటర్ వరంగల్ ప్రజలు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ వరద బాధితుల అంశాన్ని ఇటీవలే తెరపైకి తీసుకువచ్చారు. హైదరాబాద్ తరహాలోనే గ్రేటర్ వరంగల్ లోని వరద బాధితులకు కూడా రూ. 10 వేల మొత్తాన్ని పరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ‘గ్రేటర్ వరంగల్’ ఎన్నికల ప్రచారపు నగారాను బీజేపీ నేతలు ముందస్తుగా ప్రారంభించారనే విషయం బోధపడడం లేదూ!

Comments are closed.

Exit mobile version