పంజాబ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి సిద్ధూ పంపించారు. పార్టీలో తాను సాధారణ కార్యకర్తగా కొనసాగుతాని సిద్ధూ ప్రకటించారు. కేవలం మూడు నెలల పదవీ కాలంలోనే సిద్ధూ రాజీనామా చేయడం సంచలనానికి దారి తీసింది.
మాజీ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూను ముఖ్యమంత్రిగా కానివ్వనని అమరీందర్ సింగ్ ప్రకటించారు. సిద్ధూపై అమరీందర్ సింగ్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. దేశానికి, పంజాబ్ కు సిద్ధూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా మాజీ సీఎం అమరీందర్ సింగ్ మరికాసేపట్లో ఢిల్లీలోని బీజేపీ నేతలను కలిసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాను, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అమరీందర్ సింగ్ కలిసే అవకాశమున్నట్లు ఆయా వార్తల సారాంశం. అమరీందర్ సింగ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది.