ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణా క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి ఈ కింది నిర్ణయాలు తీసుకున్నది.
1. వ్యవసాయ రంగంపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించింది. తెలంగాణ రైతాంగం క్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాలల్లోనే ధాన్యం సేకరణ చేసినట్టు., ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా సమసిపోనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా గత అనుభవాలను దృష్టిలోఉంచుకుని గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలును ఎన్నిరోజులైనా కొనుగోలు చేస్తామని, చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని తమ తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని కోరింది. కాగా, ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా చూసుకుని ,తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతాంగాన్ని క్యాబినెట్ కోరింది.
2. రాబోయే సీజన్ లో రాష్ట్రంలో సాగుచేయబోయే మొక్కజొన్న అంశం పై క్యాబినెట్ చర్చించింది. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకుండా పోవడంపై, ఇందుకు కేంద్రం నిర్ణయాలు కారణం కావడం పట్ల క్యాబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయమని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్తితి ఏర్పడడంపై క్యాబినెట్ ఆవేదన వ్యక్త చేసింది. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలున్నప్పటికీ దేశ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాలనుంచి మక్కలు దిగుమతి చేసుకోవాలనుకునే కేంద్రం ఆలోచన పట్ల క్యాబినెట్ విస్మయం వ్యక్తం చేసింది. సాంప్రదాయంగా మొక్కజొన్నపంటను సాగుచేసే తెలంగాణ రైతుకు కనీస మద్దతు ధర రాకుండాపోయే గడ్డుకాలం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. విశ్వ విపణిలో మొక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి వుండడంతో పాటు, కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో, మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరింది.
3. నాలా (NALA) చట్టానికి సవరణ: వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ( WITH OUT HUMAN INTERFERENCE) ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేస్తూ చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది.
4. రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
5. జీహెచ్ఎంసీ చట్టం – 1955.. సవరణ : జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్దత కల్పిస్తూ వార్డు కమిటీల పనివిధానానికి సంబంధించి, వార్డుల రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో చట్ట సవరణలు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
6. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆన్ లైన్లో ఆస్తుల నమోదుకు మరో పదిరోజుల పాటు, అనగా అక్టోబర్ 20 తేదీ వరకు గడువును పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
7. హెచ్ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ విధానంపై క్యాబినెట్ చర్చించింది.