తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి విపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. బలిసినోల్లు..బలిసి కొట్టుకుంటుండ్రు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరానికి తాగు నీరందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లలో ఫాం హౌజ్ లు కట్టుకుని బలిసినోళ్లు వదులుతున్న డ్రైనేజీ నీటిని హైదరాబాద్ నగరం తాగాల్నట..ఈ నా కొడుకులు చెప్తున్న భాష గదీ.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఫాంహౌజ్ లను కాపాడుకోవడానికి ముసుగు తొడుక్కోవడానికి మూసీ నది కావలసి వచ్చిందా మీకు ? అని సీం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ తదితరులను ఉద్ధేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మూసీనీ అడ్డం పెట్టుకుని ఎంతకాలం బత్కుతర్రా మీరు..? ఎంతకాలం తప్పించుకుంటరు? వారం రోజులు.. పది రోజులు.. పదిహేను రోజులు.. నెలరోజులు..అయినా వదల.. మీ భరతం పడతా..మీరనుకుంటున్నరేమో..ఒక్కనొక్కల్ని శింతపండు జేస్త..’అని రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో కుటుంబ డిజిటల్ కార్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
మూసీ ఒడ్డున అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి పేద ప్రజలకు రూ. 10 లక్షలకు 100 గజాల చొప్పున టీఆర్ఎస్ సన్నాసులు అమ్మలేదా? అని సీఎం ప్రశ్నించారు. ఆ ప్లాట్లను మోసపోయి కొన్న ప్రజలు ఆవేదనలో ఉన్నారని, వారిని ప్రజలు ఇప్పుడు గల్లా పట్టి అడుగుతారని బీఆర్ఎస్ సన్నాసులు నానా యాగీ చేస్తున్నారని సీఎం అన్నారు. పేద వాళ్ళు ఎప్పుడూ మూసిలోనే ఉండాలా..? వాళ్ళు మూసీలోనే చావాలా..? మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా..? అని నిలదీశారు. మూసీ ఒడ్డున, బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను కూల్చి వేస్తే.. వారి పరిష్కారంపై చర్చిద్దాం రండి..సూచనలు చేయండి.. అని పిలుపునిచ్చారు.
మూసీ మురుగు వల్ల నల్గొండ ప్రజలు విషం తింటున్నారని, పంటలు కలుషితం అవుతున్నాయన్నారు. బుల్డోజర్లకు కేటీఆర్, హరీష్, ఈటెల రాజేందర్ అడ్డం పడతామని అంటున్నారని, బుల్దోజర్ తమ మీద నుంచి పోవాలని అంటున్నారని, వాళ్ల గురించి తానెందుకు పట్టించుకోవాలని అన్నారు. ‘పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలింది’ అన్నట్లే ఉంది కాళేశ్వరం తీరు.. అని సీఎం అన్నారు. బీఆర్ఎస్ నేతలంతా తాగునీటి వనరుల ప్రాంతాల్లో ఫాం హౌజ్ లు కట్టుకున్నారని, జన్వాడలో కేటీఆర్, అజీన్ నగర్ లో హరీష్ రావుల ఫాం హౌజులు అక్రమం కాదా? సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారులకు ఫాం హౌజ్ లు ఉన్నాయని, వాటిని కూల్చాలా? వద్దా? అని ప్రశ్నించారు. కేవీపీ రాంచందర్ రావు ఫాం హౌజ్ కూడా నగరంలోనే ఉందన్నారు.
ఫాంహౌజ్ లు కూలుతాయనే పేదలను అడ్డం పెట్టుకుని, పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి ధర్నాలకు, దీక్షలకు దిగుతున్నారని అన్నారు. మూసీపై చర్యల విషయంలో రాజకీయంగా జరిగే లాభనష్టాలు తనకు తెలియక కాదన్నారు. ఇరవై ఏళ్లపాటు ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో తిరిగిన తనకు పేదల దుఃఖం తెలుసన్నారు. ప్రజల కష్టమేమిటో తెలియకుండానే తాను తెలంగాణా రాష్ట్రానినికి ముఖ్యమంత్రిని కాగలిగానా? అని అన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపడం ప్రభుత్వం ధ్యేయమని, నగరాన్ని కాపాడడం కూడా తమ బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.