రాజద్రోహానికి పాల్పడ్డారనే అభియోగంపై ఐపీసీ సెక్షన్ 124A కింద పెడుతున్న కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయా సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐపీసీలోని 124A సెక్షన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బ్రిటిష్ కాలంనాటి వలస చట్టం ఇఫ్పుడు అవసరమా? అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యంగపరంగా చెల్లుబాటును పరీశీలిస్తామని, దీనిపై జవాబు ఇవ్వాల్సిందిగా కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
రిటైర్డ్ సైనికాధికారి జనరల్ ఎన్జీ వోంబడ్కరే ఐపీసీ 124A సెక్షన్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టంది. ఈ సందర్భంగా 124Aపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహం అభియోగంపై 124A కింద పెడుతున్న కేసులెన్ని? అందులో నిలబడుతున్నవెన్ని? అని ఆయన ప్రశ్నించారు. ఈ సెక్షన్ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించడం లేదని, ఈ చట్టం దుర్వినియోగమవుతున్న సందర్భాలే ఎక్కువగా వ్యాఖ్యానించారు.
పేకాట ఆడేవారిపైనా ఈ సెక్షన్ కింద రాజద్రోహం కేసులు పెడుతున్నారని, రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు దీన్ని తప్పుగా వినియోగిస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా ఫ్యాక్షనిస్టులు వ్యవహరిస్తున్నారని, బెయిల్ రాకుండా కక్ష సాధింపునకు, అధికార దాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వ్యవస్థలను, వ్యక్తులను బెదిరించే స్థాయికి కూడా దిగజారుతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సెక్షన్ 124A తొలగింపునకు ఆలోచించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది. ఈ చట్టం రద్దుపై వైఖరిని తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది.