తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో ఓ ఐపీఎస్ అధికారి స్థానం సంపాదించబోతున్నారా? ఈమేరకు ఆయా పోలీసు అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ కూడా చేయబోతున్నారా? ఏకంగా ఐటీ శాఖ మంత్రి పదవిని కేసీఆర్ సదరు పోలీసు అధికారికి అప్పగించబోతున్నారా? అందుకు అవకాశాలున్నాయా? మార్గం కూడా సుగమమైందా? కేరళ సీఎం పినరయ్ విజయన్ కు కూడా ఇందుకు సంబంధించి సమాచారం ఉందా? ‘ది వీక్’ మీడియా సంస్థ బుధవారం ఇదే అంశంపై ఓ సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది. తెలంగాణా రాజకీయాల్లో ఆయా వార్తా కథనం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం విశేషం.
‘ది వీక్’ వార్తా కథనం ప్రకారం… కేరళ రాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి జి. లక్ష్మణ్ తెలంగాణా సీం కేసీఆర్ కేబినెట్ లో చేరనున్నారు. 1997 బ్యాచ్ కు చెందిన ఈ అధికారి ప్రస్తుతం కేరళలో ట్రాఫిక్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడానికి ఈ ఐపీఎస్ అధికారి ముందే సర్వీసు నుంచి తప్పుకునే అవకాశం ఉంది. లక్ష్మణ్ ను కేబినెట్ లో చేర్చుకునే అంశంపై తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పటికే కేరళ సీఎం పినరయ్ విజయన్ తో మాట్లాడినట్లు కూడా ‘ది వీక్’ తన వార్తా కథనంలో ఉటంకించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో గల లక్ష్మణ్ మరో రెండు రోజుల్లో కేరళకు తిరిగి వెళ్లనున్నారని, తెలంగాణాలోని కేసీఆర్ మంత్రివర్గంలో చేరాలని తాత్కాలికంగా నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ పేర్కొన్నట్లు కూడా ఆయా పత్రిక నివేదించింది. తనను ఐటీ మంత్రిత్వ శాఖ కోసం పరిశీలిస్తున్నారని, తాను ఈ విషయాన్ని కేరళ పోలీస్ చీఫ్ లోకనాథ్ బెహరాకు చెప్పినట్లు కూడా లక్ష్మణ్ ప్రకటించారు. మరో 14 ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ, ఐపీఎస్ ఉద్యోగానికి లక్ష్మణ్ రాజీనామా చేయనున్నారు. తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారిగా లక్ష్మణ్ ను ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లా తండాకు చెందిన లక్ష్మణ్ తిరువనంతపురం రూరల్, క్రైమ్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ విభాగాల్లో కూడా పనిచేశారు. కాగా లక్ష్మణ్ రిటైర్డ్ పోలీసు అధికారి డీటీ నాయక్ బంధువని, ఈ వార్తా కథనాన్ని తొలుత ‘మనోరమ’ పత్రిక ప్రచురించినట్లు ‘ది వీక్’ ప్రకటించడం గమనార్హం.