తెలంగాణా సీఎం కేసీఆర్ పక్కనే గల ఈ ఐపీఎస్ అధికారి గుర్తున్నారు కదా? పేరు లక్ష్మణ్ నాయక్. తెలుగు ప్రజలకు సుపరిచితులైన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి డీటీ నాయక్ కు స్వయానా అల్లుడు. కేరళ రాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.

‘మళయాళ మనోరమ’ వార్తా కథనం

సరిగ్గా నెల రోజుల క్రితం తెలంగాణా రాజకీయాల్లో లక్ష్మణ్ నాయక్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆయన కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా చేరబోతున్నారంటూ దేశంలోని రెండు ప్రతిష్టాత్మక మీడియా సంస్థలు సంచలన వార్తా కథనాలు ప్రచురించాయి. ప్రాంతీయ భాషా పత్రికల్లో నంబర్ వన్ పత్రికగా పేరున్న ‘మళయాళ మనోరమ’ పత్రిక గత నెల 5వ తేదీన తొలుత ఈ సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని బేస్ చేసుకుని మరో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ‘ది వీక్’ సైతం మరో వార్తా కథనాన్ని వెలువరించింది. ఆ తర్వాత ts29.in తోపాటు అనేక తెలుగు పత్రికలు కూడా ఇదే అంశంపై వార్తలు ప్రచురించాయి.

గిరిజన సభలో అభివాదం కేరళ ఐజీ లక్ష్మణ్ నాయక్ (మద్యలో ఉన్న వ్యక్తి)

కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశంపై ఐజీ లక్ష్మణ్ నాయక్ పెదవి విప్పకపోవడమే అసలు విశేషం. కానీ ఆయా పరిణామాల తర్వాత సరిగ్గా నెల రోజుల అనంతరం ఐజీ లక్ష్మణ్ నాయక్ ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఆయన ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో లక్ష్మణ్ నాయక్ ప్రసంగిస్తూ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మొత్తంగా విషయమేమిటంటే… నెలరోజుల క్రితం తెలంగాణా రాజకీయాల్లోని వార్తల్లో వ్యక్తిగా నిలిచిన లక్ష్మణ్ నాయక్ తన రాజకీయ అరంగేట్రం, కేసీఆర్ మంత్రివర్గంలో చేరిక గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పడం లేదు. తన గళం ఏమిటో తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు చేస్తున్న అనేక ప్రయత్నాలకు ఆయన స్పందించడం కూడా లేదు.

కానీ రాజకీయంగా ఎదగాలనే తపన మాత్రం ఆయనకు ఎప్పటి నుంచో ఉందట. గత ఎన్నికల్లోనూ విఫలయత్నాలు చేశారనేది ఆయన అనుచరగణం చెబుతున్న మాట. తాజాగా గిరిజన సంఘం సభల్లో ఆయన పాల్గొనడం కూడా భవిష్యత్ రాజకీయాల వైపు లక్ష్మణ్ నాయక్ వేస్తున్న అడుగులుగానే ఆయన అనుచరగణం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా లక్ష్మణ్ నాయక్ వైఖరి మాత్రం ‘ఆశ లావు… పెదవి విప్పరు…’ అనేది పరిశీలకుల అభిప్రాయం. అదీ కేరళ ఐజీ సాబ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్.

Comments are closed.

Exit mobile version