‘ఆర్టీసీ సమ్మె ముగియడం కాదు… ఆర్టీసీనే ముగుస్తున్నది… యస్…దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా. ఆర్టీసీ కార్మికులది దురహంకార పద్ధతి. ఆర్టీసీ పని ముగిసింది…ఇట్స్ గాన్ కేస్.’ గత నెల 24వ తేదీన మీడియా సమావేశంలో తెలంగాణా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి.
‘ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే. వారి పొట్ట కొట్టే ఉద్ధేశం మాకు లేదు. మరో అవకాశం ఇస్తున్నా…బేషరతుగా మూడు రోజుల్లోగా విధుల్లో చేరండి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశమే లేదు. తెలంగాణాలోని 5,100 రూట్లలో ప్రయివేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తున్నాం.’ శనివారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై చేసిన తాజా వ్యాఖ్యలివి.
నెల రోజులకు చేరిన ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అయితే విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడే సహజ స్వభావం గురించి కొత్తగా చెప్పకునేది ఏమీ లేకపోయినా, కార్మికుల అంశంలో ఆయన మాట్లాడిన తీరు రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని కలిగించింది. విలేకరుల సమావేశం ప్రారంభమైన చాలా సేపటి వరకు ‘టోన్ డౌన్’ తరహాలోనే మాట్లాడిన కేసీఆర్ ఆ తర్వాత కాస్త కఠిన పద్ధతిలోనే స్పందించడం విశేషం. పనిలో పనిగా ఆర్టీసీని ప్రయివేటీకరణ దిశగానే పయనింపజేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలోని 5,100 రూట్లలలో ప్రయివేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశమే లేదని మరోసారి స్పష్టం చఏశారు. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయని, వాటిలో 8,300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2,100 అద్దె బస్సులు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో 2300 మూలకు పడ్డాయని చెప్పారు. మరికొన్ని వందల బస్సులు కూడా మూలకు పడే దశకు చేరుకున్నట్లు ప్రకటించారు. ఇదే దశలో ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. ‘ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ అర్ధరహితమైనది. ప్లాట్ ఫామ్ స్పీచ్ వేరు… రియాలిటీ వేరు. కార్మికులు రోడ్డున పడే అవకాశముంది. బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు. చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు. వెస్ట్ బెంగాల్లో బెస్ట్ పద్ధతి ఉంది. ఆర్టీసీ ఉండాలి. ప్రైవేటు బస్సులు ఉండాలి. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని నిర్ణయించాం. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం.’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘మేం కార్మికులపట్ల కఠినంగా లేం. బుల్డోజ్ చేయడం లేదు. వారికి 67 శాతం వేతనాలు పెంచాం. 4,260 మందిని రెగ్యులరైజ్ చేశాం. కార్మికుల కడుపు నింపినం. ఎవరి పొట్ట కొట్టలేదు. ప్రతి ఒక్కరు గౌరవ ప్రదంగా గడపాలని ప్రభుత్వం కోరుకుంటున్నది.’ అని సీం పేర్కొన్నారు.
తన ప్రసంగం ముగిశాక విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు కేసీఆర్ కాస్త కఠినంగానే స్పందించడం విశేషం. ’నో బడీ కెన్ డిక్టేట్ గవర్నమెంట్’ అని కేసీఆర్ ఆర్టీసీ యూనియన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ’ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం. సచ్చిపోయిన కార్మికుల విషయంలో యూనియన్లు బాధ్యత వహించాలి. ఇంగితం, అర్థం లేకుండా, అహంకార పూరితంగా సమ్మెకు వెళ్లారు.’ అని కేసీఆర్ అన్నారు. బయట ఎల్లయ్య ఏదో మాట్లాడుతడు. ఓ సీఎంను, నన్ను పట్టుకుని అడుగుతవానవయా? సోయి ఉండి మాట్లాడాలె.’ అని ఓ విలేకరి ప్రశ్నకు జవాబుగా స్పందించారు. యూనియన్ల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, హైకోర్టులో అబద్ధాలు చెప్పారని యూనియన్ నాయకులను కేసీఆర్ నిందించారు. ‘ప్రభుత్వం చాలా ఇస్తది. ఆ పని మాది. హైకోర్టు మమ్మల్ని అనలేదు. ఆయనెవరో అడ్వకేట్ అన్నడు. డాక్యుమెంట్లు పట్టుకుని మాట్లాడిండు. కొన్ని ఇంటర్నల్ డాక్యుమెంట్లు ఉంటయ్. నిధుల విడుదల విషయంలో కామెంట్ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు.’ అని హుజూర్ నగర్ అంశం నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. ‘ఆర్టీసీ దివాళా తీసిందని ఎవరు చెప్పిండ్లు? నేను చెప్పలేదు. ఆర్టీసీ, ప్రయివేట్ సంస్థలు ఐదు వేల చొప్పున బస్సులు నడుపుతయ్’ అని సీఎం అన్నారు. ’మంచి ప్రభుత్వం కాబట్టి ఇంకో అవకాశం ఇస్తున్నం. ఇది అక్రమ సమ్మె అని లేబర్ డిపార్ట్ మెంట్ ప్రకటిస్తే పరిస్థితి వేరుగా ఉంటది. ఉద్యోగితో సంబంధమే ఉండదు. జీహెచ్ఎంసీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమైతది…? మధ్యప్రదేశ్ లాగ అయితది. ఆర్టీసీ రహిత రాష్ట్రంగా తెలంగాణ అయితది.’ అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ’కార్మికుల కుటుంబాల్ని రోడ్డున పడేయొద్దు. నవంబర్ 5 వరకు విధుల్లోకి రాకపోతే… మిగతా 5 వేల రూట్లు కూడా ప్రైవేటుకు అప్పగిస్తాం. మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోం. అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పు. అవకాశం చేజార్చుకోవద్దు.’ అని కార్మికులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనపు అంశంలోనూ కేసీఆర్ గత ప్రకటనకు విరుద్ధంగా స్పందించడం కొసమెరుపు. ’వాళ్లేం చెప్పిండ్రో మాకేం తెలుసు?’ అని ముక్తాయింపు ఇచ్చారు. మొత్తంగా మంత్రివర్గ సమావేశం అనంతరం ఆర్టీసీ సమ్మెపై మీడియా సమావేశంలో కేసీఆర్ కాస్త కనికరం, మరికాస్త కఠినత్వం ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.