యాదాద్రి దివ్యక్షేత్రాన్ని వచ్చే మే నెలలలో పునఃప్రారంభించే అవకాశమున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో రానున్న మే నెలలో పునః ప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకుపైగా ఆలయ ప్రాంగణంతోపాటు దాని చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
ఆలయ పునః నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇంకా అసంపూర్తిగా వున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి కి చేరుకున్న సీఎం తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలో ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి? అవి ఎన్నిరోజుల్లో పూర్తవుతాయనే అనే విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధాన ఆలయ ప్రాగణంలో కలియదిరిగిన సీఎం కేసీఆర్, మాడ వీధులు, క్యూ లైన్ దారి, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు,శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణీ, భక్తుల స్నాన గుండం నిర్మాణం, మెట్ల దారి నిర్మాణం పరిశీలించి, పలు సూచనలు చేశారు.
అలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపం(ఆర్ణమెంటల్ లుక్)’ తో ఉండేలా, బ్రాస్ మెటల్ తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు కూడా భక్తి భావన వుట్టి పడేలా దీపాలంకరణ ఉండాలన్నారు. దేవాలయ ముందుభాగం కనుచూపు మేర నుంచి చూసినా స్పష్టంగా కనిపించేలా అత్యద్భుతంగా తీర్చి దిద్దాలన్నారు. ప్రాచీనత, నవ్యతతోపాటు దైవ సందర్శకులకు, భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలని కోరారు. దేశం లోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర సహా నరసింహుని చరిత్రను తెలియ పరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణంలో అలంకరించాలన్నారు. ప్రహరీని ఆనుకుని వుండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో క్యూలైన్లను విశాలంగా నిర్మించాలని కోరారు.
మూల విరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. గర్భగుడి ముందరి ధ్వజస్థంభాన్ని హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూర్ పెయింటింగులను పరిశీలించారు. నృసింహస్వామి గర్భగుడిలో పూజలు చేశారు. బంగారు తాపడం చేసిన పలు దేవతా మూర్తులను పరిశీలించారు. ఆండాళ్ ఆల్వార్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్ దైవ దర్శనానంతరమే క్షేత్రపాలకుని దర్శనం ఆనవాయితీగా వస్తున్నదని, దాన్నే కొనసాగించాలని సూచించారు. అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నపుడు హడావిడి పడకూడదన్నారు. తిరుపతిలో లాగా, స్వామి వారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా ప్రభుత్వం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నదన్నారు.
ఫొటో: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించినప్పటి దృశ్యం.