“బాధ్యత గల ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వాధినేతగా, రాష్ట్రాన్ని తెచ్చి, చక్కటిమార్గంలో తీసుకువెళ్ళే వ్యక్తిగా అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి” తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాటి విలేకరుల సమావేశంలో చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్లో ఇదీ ఒకటి. నిజమే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను వ్యవహరించాల్సిన తీరును తానే స్పష్టం చేశారు. అయితే…ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి రాష్ట్ర హైకోర్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో కేసు విచారణకు సంబంధించి కేసీఆర్ మాట్లాడుతూ, ” హైకోర్టు ఏం చెప్తది? కొడ్తదా? సంకల సస్కాన ఉంటేనే కదా ఇచ్చేది? 29న కోర్టు విచారణ ఉంది. హైకోర్టుకు దీనిపై తీర్పు చెప్పే అధికారం లేదు” అని వ్యాఖ్యానించారు. నిన్నటి విలేకరుల సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి అటు కార్మిక సంఘాలపై, ఇటు హైకోర్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి.
ప్రైవేట్ సంభాషణ వేరు… పబ్లిక్ గా మాట్లాడడం వేరు…పబ్లిక్ గా మాట్లాడే సమయంలో ప్రజానాయకులు, ముఖ్యంగా ప్రభుత్వాధినేతలు జాగ్రత్తగా మాట్లాడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నది న్యాయవాద వర్గాల అభిప్రాయం. సమాజం గురించి తెలియనివాడు మాట్లాడడం వేరు…చట్టం గురించి తెలిసినవారు మాట్లాడడం వేరుగా ఆ వర్గాల విశ్లేషణ. న్యాయ వ్యవస్థ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాట్లాడిన తీరు సామాన్య ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలను తీసుకువెళుతుందని న్యాయవాద వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ‘బాధ్యత గల నేతల నియంత్రణ లేని భాష సమాజంలోకి ప్రమాదకర సంకేతాలను పంపుతుంది’ అని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి న్యాయ వ్యవస్థ గురించి ఇలా మాట్లాడితే, ఏమీ తెలియనివారు ఆ వ్యవస్థపై తిరగబడే ప్రమాదం ఉంటుందని, ఫలితంగా శాంతి, భద్రతలు అదుపు తప్పితే ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయవాద వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
చట్టాన్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి హైకోర్టు గురించి చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకే వస్తాయని ప్రముఖ న్యాయవాది ఒకరు అభిప్రాయపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం చంద్రబాబుల పదవీ కాలాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను కొన్నింటిని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. కోర్టులు కొరడా ఝులిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అప్పటి కొన్ని తీర్పులను మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా ఓ లేఖ రాస్తే చాలు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. కోర్టుల గురించి, అవి ఇచ్చే తీర్పుల గురించి వ్యాఖ్యలు చేసే అధికారం ఎవరికీ లేదని, ఓ తీర్పు గురించి వ్యాఖ్యలు చేసిన ఒకానొక జడ్జి విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందించిందో తెలుసుకోవలసిన అవసరం ఉందని న్యాయవాద వర్గాలు హితవు చెబుతున్నాయి.