రాజకీయ పార్టీలకు చెందిన అధినాయకుల బర్త్ డే కార్యక్రమాలను దిగువ స్థాయి నాయకులు ఎలా నిర్వహిస్తారు? మహా అయితే మొక్కలు నాటుతారు… లేదంటే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు.. ఇవీ కాదనుకుంటే ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతారు. ఇవేవీ వద్దనుకుంటే గుళ్లూ, గోపురాలకు వెళ్లి తమ అభిమాన నాయకుడి పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంకొందరు పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి సంబురపడుతుంటారు. ఈ తరహా కార్యక్రమాలు రొటీన్…

కానీ కరీంనగర్ కు చెందిన ఎడ్ల అశోక్ అనే టీఆర్ఎస్ జిల్లా నాయకుడు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమం వినూత్నం. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను కేసీఆర్ బర్త్ డే కు అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించడం ద్వారా అశోక్ తనదైన శైలిని చాటడమే విశేషం.

ఇంతకీ అశోక్ ఏం చేశాడనేగా మీ డౌటు…? సమ్మక్క జాతర సందర్భంగా భక్తులు తమ మొక్కుల్లో భాగంగా కోళ్లను, మేకలను, గొర్లను కోసుకుని అమ్మవారిని నైవేద్యం సమర్పిస్తారు తెలిసిందే కదా! భక్తుల మొక్కులకు అనుసంధానంగా అశోక్ తన సతీమణి, మున్సిపల్ కార్పొరేటర్ ఎడ్ల సరితతో కలిసి సుమారు 300 మందిపైచిలుకు కుటుంబాలకు కోడిపుంజులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి నగర మేయర్ వై. సునీల్ రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగానే నగరంలోని కిసాన్ నగర్ పార్టీ ఆఫీసులో అశోక్ కోడిపుంజులను పంపిణీ చేశారు. అందరిలా మొక్కలు నాటి, పూజలు చేసి, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విశేషం ఏముంది…? అందుకే కాబోలు ఎడ్ల అశోక్ వెరైటీగా కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కోడిపుంజులను పంపిణీ చేశారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేతికందిన కోడిపుంజును స్వీకరించినవారు మహా సంబురపడ్డారు. ఎడ్ల అశోక్ పూర్వాశ్రమంలో జర్నలిస్టు కావడం కొసమెరుపు.

Comments are closed.

Exit mobile version