పీసీసీ కార్యదర్శి, హుజూరాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈమేరకు పీసీసీ క్రమ శిక్షణా సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పార్టీతో కౌశిక్ రెడ్డి కుమ్ముక్కయ్యారని, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నందువల్లే బహిష్కరణ వేటు వేసినట్లు ఆయన వివరించారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్ కావడం, కొద్ది గంటల్లోనే పీసీసీ క్రమ శిక్షణా సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వేగంగా మారిన ఈ పరిణామాల్లోనే కౌశిక్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరును కొనియాడారు. ఈ పరిణామాల్లోనే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ పీసీసీ క్రమశిక్షణా సంఘం ప్రకటించడం వంటి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. మరోవైపు ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి నిర్మల్ లో ప్రకటించిన కొద్ది సేపటికే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన వెలువడడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version