కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కరీంనగర్ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఇండోనేషియా వాసులు అంటించిన కరోనా కట్టడి అంశంలో కరీంనగర్ అధికార యంత్రాంగం అనుసరించిన పద్ధతులను గ్రేటర్ హైదరాబాద్ లో అమలు జరపాలని గురువారం నాటి ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించడం గమనార్హం.
వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులే కాదు కరీంనగర్ పోలీసు అధికారులు సైతం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనుసరణకు మార్గదర్శకంగా నిలవడం విశేషం. ముఖ్యంగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో కరీంనగర్ పోలీసులు అనుసరిస్తున్న పద్ధతులను రాష్ట్ర ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
కంటైన్మెంట్ ఏరియాలుగా ప్రకటించిన ప్రదేశాల్లో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందే కాదు కరీంనగర్ పోలీసులు కూడా డేగకన్ను వేశారు. పరిధి దాటి, నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులే నేరుగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెంపరేచర్ పరిస్థితులను స్క్రీనింగ్ యంత్రాల ద్వారా కొలిచి, కరోనా లక్షణాల అనుమానిత వ్యక్తులను బజారు నుంచే నేరుగా క్వారంటైన్ కు పంపుతున్నారు. దీంతో రోడ్లపైకి ఇష్టానుసారంగా వచ్చేవారికి వణుకు పుడుతోందట. స్క్రీనింగ్ జరిపే సమయానికి టెంపరేచర్లో తేడా వస్తే క్వారంటైన్ తప్పదనే భయంతో ప్రజలు రోడ్లపైకి రావడానికి ఒకటికి, నాలుగుసార్లు ఆలోచిస్తున్నారట.
ఈ స్క్రీనింగ్ అంశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని పోలీసు టీములకు స్క్రీనింగ్ మెషీన్లను తెప్పించి అందించారు. వారికి కర్తవ్యాన్ని నిర్దేశించారు. సీపీ కమలాసన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఇదిగో ఇలా రోడ్లపై స్క్రీనింగ్ జరిపే విధులను కూడా పోలీసులు తమ భుజాన వేసుకున్నారు. కరోనా కట్టడిలో కరీంనగర్ లో తీసుకున్న చర్యలను గ్రేటర్ హైదరాబాద్ లో అమలు చేయాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారంటే ఇక్కడి అధికారుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.